Jagan changed constituency observer: గత కొంత కాలంగా వైసీపీ నేతలు తమ స్వంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఆయా నాయకులు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. వారిపై చర్యలకు ఉపక్రమించాలనే అభిప్రాయానికి వచ్చిన వైసీపీ పెద్దలు.. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టారు. నెల్లూరు వైసీపీలో ఇప్పటికే ఇద్దరు నేతలపై వేటు వేయగా.. నేడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకుడిపై వేటు వేసింది. సీఎం ఆదేశాల మేరకు ఉదయగిరి పరిశీలకుడిగా కొడవలూరు ధనుంజయరెడ్డిని తప్పించగా... విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజకవర్గ నేత శరగడం చిన్న అప్పలనాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది.
కొలవలూరు ధనుంజయరెడ్డి: రాష్ట్రంలో ఇద్దరు వైసీపీ నేతలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడి కొలవలూరు ధనుంజయరెడ్డిపై వేటు వేసిన వైసీపీ.. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించింది. తన నియోజకవర్గంలో అతిగా వ్యవహరిస్తున్నారంటూ ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బహిరంగ విమర్శలు చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన దృష్ట్యా పరిశీలకుడిపై వేటు వేశారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కొలవలూరు ధనుంజయరెడ్డిని తప్పించిన వైకాపా.. ఆయన స్థానంలో నూతన పరిశీలకుడిగా మెట్టుకూరి ధనుంజయరెడ్డిని నియమించింది.