నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు.
ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగిన విక్రమ్ రెడ్డి.. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 76,096 (పోలైన మొత్తం ఓట్లలో 50 శాతానికిపైగా) ఓట్లు దక్కించుకోవడంతో.. విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ప్రత్యర్థి భాజపా అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్‌పై 82,888 ఓట్ల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. అయితే.. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. కేవలం 1,37,081 (64 శాతం) మంది మాత్రమే ఓటు వేశారు.