వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్(36) చేపల చెరువును సబ్ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.
Police case file ఈసారి వర్షాలు కురిసేలోపే చేపలు పట్టి విక్రయించాలని భావించగా, ముసునూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు ycp leaders అడ్డుకున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు, వైకాపా సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడంతో పాటు గత నెలలో చెరువులో మందు కలపడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన కరుణాకర్ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కారణమైన వారి వేధింపులతో పాటు, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి సూసైడ్ నోట్ రాశాడు. కరుణాకర్ ఆత్మహత్యపై జగదీశ్వర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డిలపై కావలి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐపీసీ 306 సెక్షన్ల కేసు నమోదైంది. ఎస్పీ విజయరావు ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ఖాజావలి ఘటనాస్థలికి చేరుకొని విచారించారు.