YCP MP ADALA PRABHAKAR LETTER TO NELLORE COLLECTOR : ఇల్లు కట్టాలన్న సామాన్యుల కలను.. వెరిఫికేషన్ పేరుతో కల్లగా మార్చడం.. భవన నిర్మాణానికి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందినప్పటికీ.. కొర్రీల పేరుతో దండుకోవడం.. అనుమతులకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణాలు జరిపినా సొంత ప్రయోజనం చూసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరించడం అక్కడ ఎప్పుడూ జరిగేదే! ఇప్పుడు.. కలెక్టర్ ఆదేశాలనే భేఖాతరు చేశారు. దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు ఇచ్చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలోనూ పరిశీలించిన దాఖలాలు లేవు. అయితే దీనిపై ఏకంగా అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు స్పందించడం.. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు బరితెగిస్తున్నారు. భూ కబ్జాదారులతో కలిసి అనుమతి లేని లే అవుట్లలో భవన నిర్మాణాలు మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమించి వేసిన లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని గతంలో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఆక్రమణలు తొలగించి.. ఇరిగేషన్ స్థలాలు యథాస్థితికి తీసుకురావాలని సూచించగా వాటిని ధిక్కరించి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే అక్రమాలకు పాల్పడ్డారు. చట్టబద్ధంగా కేటాయించిన విధులపై భక్తి, నైతిక బాధ్యత లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకోండి'-కలెక్టరుకు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రాసిన లేఖ
ఓ ప్రజాప్రతినిధి అండతో.. నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఓ అధికారి అక్రమాలను పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రజా ప్రతినిధికి నమ్మినబంటుగా ఉంటూ... ఆయన అండతో నిబంధనలను పట్టించుకోవడం లేదన్నది సొంత శాఖలోనే వినిపిస్తున్న మాట. నగరపాలక సంస్థలో డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, ఒక టీపీవో, అయిదుగురు టీపీఎస్‌లు, తొమ్మిది మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు టీపీవోలు, ముగ్గురు టీపీఎస్‌లు, ఒక బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. సిబ్బంది లేరనే కారణాన్ని చూపి.. కనీసం తనిఖీలకూ వెళ్లని పరిస్థితి ఉంది. భవన నిర్మాణదారుల దగ్గర డబ్బు వసూలు చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో గత కమిషనర్ ఆయనపై విచారణకు ఆదేశించారు. ఇప్పుడు ఆయనే ఆ శాఖలో కీలక పదవిలో ఉండటం గమనార్హం. దీనిపై ఇన్చార్జి కమిషనర్ చెన్నుడును వివరణ కోరగా.. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి లేఖ రాసిన విషయం నా దృష్టికి రాలేదు. రెండు రోజుల నుంచే ఇన్ఛార్జిగా ఉన్నాను. పూర్తి వివరాలు కనుక్కుంటాను.. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.