నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి అధికారులపై మండిపడ్డారు. రాపూరులో మూడు మండలాల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన.. వెంకటగిరి అభివృద్ధికి జిల్లా అధికారులు సహకరించడం లేదని విమర్శించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి అయిన డీఆర్డీఏ పీడీ.. 3, 4 తేదీల్లో తాను తలపెట్టిన సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని ఆనం తప్పుబట్టారు.
తెలుగుగంగ జలాలను కండలేరు జలాశయం ఉన్న సొంత నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరిని విస్మరించి ఇతర ప్రాంతాలకు విడుదల చేయడం సరికాదని ఆనం హితవు పలికారు. మరోవైపు రాపూరులో నాడు - నేడు పథకంలో కోటీ 24 లక్షల వ్యయంతో నిర్మించే భవన నిర్మాణాలను సందర్శించిన ఆయన అభివృద్ధి పనులు తనకు తెలియకుండా చేస్తుండడం విచిత్రంగా ఉందని విమర్శించారు.