ఎన్నికల్లో ప్రత్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారనే కారణంతో తెదేపా యువనేత తిరుమలనాయుడుని హత్య చేయడానికి ప్రయత్నించడం నెల్లూరు జిల్లాలో సంచలనం రేకెత్తించింది. ఏప్రిల్ 11న పోలింగ్ తరువాత నెల్లూరులో తెదేపా నేతపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులే దాడి చేశారని పోలీసులు తేల్చారు. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే నెల్లూరులో ఇలాంటి నేర సంస్కృతికి తెరలేపిన వైకాపా తీరుపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
అబ్దుల్ అజీజ్‌కు మద్దతుగా ప్రచారం చేశారని...
ఈ ఎన్నికల ప్రచారంలో తెదేపా నెల్లూరు గ్రామీణ అభ్యర్థి అబ్దుల్ అజీజ్‌కు మద్దతుగా ప్రచారం చేశారని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలపై వైకాపా కార్యకర్తలు 14వ తేదిన దాడి చేశారు. వైకాపాకు చెందిన ఏడుగురు ఇనుపరాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో హత్య చేయించేందుకు యత్నించారని బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు... ఏడుగురు వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరిలో కొందరు ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు ఉన్నట్లు తేలింది.