అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే హతమార్చిందో భార్య. ప్రియుడి సహాయంతో ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. చివరకు పోలీసులకు చిక్కింది. నెల్లూరు జిల్లా కోవూరులో ఈ నెల 7న జరిగిన హత్య కేసు వివరాలను రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి వెల్లడించారు. కోవూరు మండలం కొత్తూరు హరిజనవాడలో రవీంద్ర, సమత దంపతులు జీవనం సాగిస్తున్నారు. రవీంద్ర ఓ చర్చిలో పాస్టర్ కాగా.. సమత గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. గత కొంతకాలంగా రాము అనే వ్యక్తితో సమత అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్రవర్తనను గమనించిన రవీంద్ర.. ఆమెను పలుమార్లు మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాకపోగా.. భర్త హత్యకు పథకం వేసింది.
ప్రియుడితో కలిసి..
రాత్రి సమయంలో భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి మరీ.. సమత ప్రియుడితో ఏకాంతంగా గడిపేదని పోలీసులు వెల్లడించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రవీంద్రను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించినట్లు తెలిపారు. ఈనెల 7న ప్రియుడి సహాయంతో ఊపిరాడకుండా చేసి భర్తను హతమార్చినట్లు డీఎస్పీ తెలిపారు.