రాష్ట్రంలోని తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఇందుకు రూ.1,088 కోట్ల నిధులను సైతం మంజూరు చేశాయి. త్వరలోనే పనులు కూడా చేపడతామని మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు వెల్లడించారు.
గంగపుత్రుల ఇబ్బందులు తీర్చేందుకు..
నెల్లూరు జిల్లాలో గంగపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తోందని మత్స్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని బోగోలు మండలం జువ్వల దిన్నె గ్రామంలోని ఈ ఫిషింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జువ్వలదిన్నెలో ఏర్పాటు చేసే ఫిషింగ్ హార్బర్ కోసం ప్రభుత్వం రూ.288 కోట్ల నిధులు కేటాయించగా.. రూ.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. త్వరలోనే ఆయా పనులు ప్రారంభించనున్నట్లు మత్స్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.