శ్రీశైలం నుంచి 250 కిలోమీటర్లు ప్రవహించి కండలేరులో కలుస్తున్న నీరు- 200 మీటర్ల దూరంలో ఉండే మెట్ట చేనుకు మాత్రం చేరలేకుంది. కళ్లెదుటే కనిపించే పొలాలకు వాటిని తరలించాలన్న ప్రయత్నానికి పుష్కర కాలం పూర్తయింది. చేజర్ల, కలువాయి మండలాల్లో సోమశిల, కండలేరు కాలువల మధ్య మిగిలిన 14 వేల ఎకరాల మెట్ట భూములకు నీరందించాలన్న లక్ష్యంతో తలపెట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో 30 శాతం మాత్రమే పనులు మిగిలి ఉండగా- ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వని కారణంగా 2018లో ఆగిన పనులు ఇంత వరకు పునః ప్రారంభం కాలేదు. మరోవైపు కంటికి నీరు కనిపిస్తున్నా.. చేలకు చేరే దారి లేక రైతులు వర్షాధార సాగుతో నష్టాల సేద్యం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోంది.
చిక్కుముళ్లు
చేసిన పనులకు బిల్లులు అందని కారణంగా కొందరు గుత్తేదారులు చెరువులు, కాలువల పనులు నిలిపివేశారు. దాంతో పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. కాలువలకు, చెరువులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ, రైతులకు బకాయిలు చెల్లించని కారణంగా పనులు చేయలేకపోతున్నామని మరికొందరు చెబుతున్నారు. ఇంకోవైపు కాలువలు, చెరువుల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వర్షపు నీరు వృథా
ఎస్‌ఎస్‌ఎల్‌సీ పథకంలో చెరువుల నిర్మాణం పూర్తికాకపోవడంతో వర్షాకాలంలో వచ్చే నీటని వినియోగించుకునే అవకాశం లేక.. నీరంతా వృథాగా పెన్నానదికి చేరుతోంది. పూర్తయితే రెండు మండలాల్లోని 15 గ్రామాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరిపోతాయి. ఎకరానికి రూ. పదివేల నికర ఆదాయం వచ్చినా.. రైతులకు ఏటా రూ. కోట్లలోనే రాబడి వస్తుంది. పండ్ల తోటలు, జీవాలు, పశుపోషణ అవకాశాలు మెరుగవుతాయి.
ఇదీ సంగతి..
పథకం:ఎస్‌ఎస్‌ఎల్‌సీ- ప్యాకేజీ నంబరు-12
ప్రదేశం:సోమశిల- కండలేరు వరద కాలువ దిగువన
నిర్మాణ వ్యయం:రూ. 28కోట్లు