విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులోని అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంతోపాటు కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం, ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెద్దగా కనిపించలేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆలయాలకు వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో చివరిరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నిజరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నగరోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు.. చివరి రోజు రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు ఆభయమిచ్చారు.