Cooperative Bank Chairman resigned: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ సూర శ్రీనివాసులు రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరో పది రోజుల్లో ఆయన పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో నేడు రాజీనామా చేయడం ఏమిటని బ్యాంకు ఖాతాదారులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ క్రమంలో ఛైర్మన్ సూర శ్రీనివాసులు రెడ్డి తన పదవికాలం ముగియక ముందే ఎందుకు తన పదవి నుంచి తొలుగుతున్నారని ఆరా తీసేపనిలో పడ్డారు. ఇటీవలే కోపరేటివ్ బ్యాంకులో దాదాపు రూ.1.55కోట్లు సొంతానికి వాడుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై అధికారులు సూరాకు ఇటీవల షోకాజ్ నోటీస్‌లు కూడా అందించి, విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల విచారణకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే తన పదవీ కాలానికి పది రోజుల ముందే రాజీనామా చేస్తున్నట్లు సూర ప్రకటించారు.
అనంతరం బ్యాంకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తమ రాజీనామాకు సంబంధించిన పలు కీలక విషయాలను సూరా వెల్లడించారు. పదేళ్లుగా బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశానని, పది సంవత్సరాల కాలంలో బ్యాంకును అన్ని విధాలా అభివృద్ధి చేశానని తెలిపారు. రుణాలు కావాలని రైతులు బ్యాంకుకు వస్తే విరివిగా అందించానని వెల్లడించారు. తాను చైర్మన్ పదవికి రాజీనామా చేసినా వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
వవ్వేరు కోపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ సూర శ్రీనివాసులు రెడ్డి రాజీనామా పది సంవత్సరాల కాలంలో బ్యాంకును అన్ని విధాలుగా అభివృద్ది చేశాం. ఎవరూ చేయలేని అభివృద్దిని నేను చేశాను. బ్యాంకులో కమ్యునిటీ హాల్, కంప్యూటరీకరణ, బ్యాంకు ముందు ఎలువేషన్ పూర్తి చేయించాను. ఈ మధ్య కాలంలో నాపై కొన్ని అపోహలు వచ్చాయి. అవన్నీ కూడా కమిటీ వేసి, చర్చించి నివేదిక ఇవ్వడం జరుగుతావుంది. నాపై అపవాదు వచ్చినందున నాయంతలో నేనే తప్పుకుంటే మంచిదని నిర్ణయించుకున్నాను. అందుకే ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను.- సూర శ్రీనివాసులు రెడ్డి, వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్
ఇవీ చదవండి