ఇప్పుడు నెల్లూరు వంతు... ఆగని యురేనియం అన్వేషణ.... - నెల్లూరులో యురేనియం అన్వేషణ
కడపజిల్లాలో 6 గ్రామాల ప్రజలు యురేనియం పరిశ్రమ కారణంగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ తవ్వకాలు వద్దని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాంతంలో యురేనియం అన్వేషణ జరుగుతుండటం ప్రజలను కలవరపెడుతోంది.
నెల్లూరు జిల్లా ప్రజలకు జీవనాడి సోమశిల రిజర్వాయర్. తొమ్మిది లక్షల ఎకరాలకు సాగు... తాగునీరు సరఫరా చేస్తుంది. ఈ జలాశయం చుట్టూ పచ్చగా ఉండే మల్లెంకొండ అడవులు ఉన్నాయి. ఎంతో అహ్లాదకరమైన ఈ ప్రాంతంలో యురేనియం అన్వేషణ పనులు ప్రారంభమయ్యాయి. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం పరిశ్రమ బాధితులకు న్యాయం జరగకముందే నెల్లూరు జిల్లాలో జరిపే తవ్వకాలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని పడమటి కంబంపాడు కొండ ప్రాంతాల్లో సర్వే పూర్తి చేసి, తవ్వకాలకు సిద్ధమవుతున్నారు. దీనికోసం యంత్రాలను సైతం తీసుకొచ్చారు. ఈ పనుల వల్ల సోమశిల నీరు కలుషితం అవుతుందేమోనని ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. 30 ఏళ్ల కిందట ఇదే ప్రాంతంలో అటామిక్ ఎనర్జీ సంస్థ పరిశోధనలు చేసింది. అప్పట్లో స్థానికులు వ్యతిరేకించేసరికి పనులు నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు అటామిక్ ఎనర్జీ సంస్థ డ్రిల్లింగ్ పనులు మొదలు పెట్టింది. యురేనియం నిక్షేపాలను అన్వేషిస్తోంది. యురేనియం తవ్వకాలు నిలిపేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరిస్తున్నారు.