ప్రతి భారతీయుడూ తన జన్మభూమితో అనుసంధానమై ఆ ప్రాంత అభివృద్ధికి ఏదైనా చేయాలనుకుంటే.. ఒక్కసారైనా నెల్లూరు వచ్చి వెంకయ్య నాయుడు చేస్తున్న పనిని చూడాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. వెంకయ్యనాయుడి స్వగ్రామం చూడాలని, అక్కడే ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో కలిసి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో మంత్రిగా చేసే అవకాశం వచ్చినప్పుడు.. వెంకయ్య తన హృదయానికి దగ్గరగా ఉండే గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారని గుర్తు చేశారు. అది గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో ఆయనకు ఉన్న శ్రద్ధ, అంకితభావాన్ని తెలుపుతోందని ప్రశంసించారు. స్వయంగా గ్రామీణ ప్రాంతానికి చెందడం, బాల్యమంతా పల్లెటూళ్లలోనే గడవడంతో ఇక్కడి సమస్యలు, వాటి పరిష్కారం గురించి ఆయనకు బాగా తెలుసన్నారు. ఇప్పటికీ.. రైతులపై తన ప్రేమను ఆయన ఏమాత్రం దాచుకోరని, ఎప్పుడు కలిసినా రైతుల కోసం ప్రభుత్వం ఏం చేయాలి.. ఏం చేస్తోందనే అంశాలపై చర్చిస్తారని చెప్పారు.
పార్టీ అధ్యక్షుడిగానూ...
వెంకయ్య నాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ దేశంలోని నలుమూలలకూ వెళ్లిందన్నారు. ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా క్రమశిక్షణతో వాటన్నింటినీ సమర్థంగా పూర్తి చేశారన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక పొరపాటున కూడా ‘మన పార్టీ’ అనే మాట ఆయన నోటి నుంచి వినలేదన్నారు. ‘యువకుడిగా ఉన్నప్పుడే ఆర్టికల్ 370 రద్దు కోసం జరిగిన దేశవ్యాప్త ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. ఆ బిల్లు రద్దు సమయంలో రాజ్యసభ ఛైర్మన్ సీట్లో వెంకయ్య ఉండటం.. ఆ బిల్లును నేను ప్రవేశపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అమిత్‌షా అన్నారు. విలువల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్న స్వర్ణభారత్ ట్రస్టు అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు.
కామాలు, ప్రశ్నార్థకాలు లేని దేశం చూడాలన్నది నా కల
జమ్మూకశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన రోజు.. తన జీవితంలో చరిత్రాత్మకమైందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కశ్మీర్ భారతదేశంలో భాగమని, ఎలాంటి కామాలు, ప్రశ్నార్థకాలు లేని దేశాన్ని చూడటం తన చిన్నప్పటి కల అని ప్రస్తావించారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినరోజు తాను పడిన ఒత్తిడిని గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్న విషయాన్ని ప్రధాని మోదీ.. ముందురోజు తన ఇంటికి వచ్చి తెలిపారన్నారు. మెజారిటీ ఉన్న లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా రాజ్యసభలో ఎందుకని ప్రశ్నించానని, దానికి మోదీ.. మొదట రాజ్యసభలోనే ప్రవేశపెడదామని చెప్పడంతో తాను ఒత్తిడికి గురయ్యానన్నారు. తన భార్య, కుమార్తె కూడా తన ఆరోగ్యం విషయంలో కంగారు పడినట్లు వెల్లడించారు. కార్డియాలజిస్టు బలరాం భార్గవ్‌ను పిలిపించగా.. ఏం కంగారుపడాల్సిన పని లేదని, తాను గ్యాలరీలోనే ఉంటానని ఆయన చెప్పినట్లు తెలిపారు. అనంతరం అమిత్‌షా సభలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ప్రస్తావించడంతో పాటు విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, దానిపై సుదీర్ఘ చర్చకు అవకాశం ఇవ్వడంతో సాయంత్రానికి ఆమోదం పొందినట్లు గుర్తుచేశారు.
మోదీ చొరవతోనే అర్హులకు పద్మ పురస్కారాలు