Orphan Children Life: ఓ యువ జంటకు వివాహమై నిండా నాలుగేళ్లు కాలేదు.. పచ్చటి సంసారాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. చిన్నపాటి మనస్పర్థలతో ఆరు నెలల వ్యవధిలో దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించారు. క్షణికావేశంలో ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. పిల్లలకు పూల బాట వేసి ఉన్నత స్థాయికి చేర్చాల్సిన తల్లిదండ్రులు లేకపోవటంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని మినగల్లు గ్రామానికి చెందిన సూరిపోగు వెంకటేశ్వర్లుకు 2019లో ఇనగలూరికి చెందిన పెంచల రత్నమ్మతో వివాహం జరిగింది. వీరి సంసారం సజావుగానే సాగింది. వారికి ఒక పాప, బాబు పుట్టారు. అయితే కొన్నాళ్లకు ఆ దంపతులిద్దరికీ మనస్పర్థలు రావటం మొదలై.. తరచూ గొడవలు పడేవారు. వారి మధ్య వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. దీంతో భార్య రత్నమ్మ గతేడాది డిసెంబర్ 22న ఇంట్లో ఉన్న వంట గ్యాస్ లీక్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన భర్త వెంకటేశ్వర్లు మద్యానికి బానిసయ్యాడు. భార్యను మర్చిపోలేక ఇటీవల మే 22న మద్యంలో పురుగులమందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మిగిలారు. ప్రస్తుతం పాప వయస్సు రెండు సంవత్సరాలు కాగా.. బాబు వయస్సు ఏడు నెలలు. ఈ ఇద్దరు చిన్నారులను చూసుకునేందుకు దివ్యాంగురాలైన నాయనమ్మ ఆదిలక్ష్మి మాత్రమే ఉంది. పోలియో కారణంగా ఆదిలక్ష్మి ఎడమ చేయి పని చేయదు.
తల్లిదండ్రుల మరణంతో అనాథలైన చిన్నారులు వెంకటేశ్వర్లు చిన్నతనంలో ఉండగానే ఆదిలక్ష్మి భర్త మరణించాడు. దీంతో దివ్యాంగురాలైన ఆమె.. ఎంతో కష్టపడి కుమారుడిని పెంచి పోషించింది. కుమారుడికి పెళ్లి చేసిన అనంతరం.. ఆమె బాధ్యతలు కొంతమేరకు తీరాయి అనుకునే సమయానికి.. కుమారుడు, కోడలు మరణించడంతో ఆమె అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. వారు చనిపోయిన కొండంత బాధను దిగమింగుతున్న ఆమెకు.. ఆ చిన్నారులను సాకాల్సిన బాధ్యత మరింత భారంగా మారింది.
దివ్యాంగురాలైన ఆమె ఈ వయస్సులో తన పని తాను చేసుకోలేని స్థితిలో చిన్నారులను సాకలేక అగచాట్లు పడుతోంది. ఇరుగుపొరుగువారి సహాయంతో పిల్లల బాగోగులు చూస్తోంది. వారు ఉండేందుకు కూడా సరైన ఇల్లు లేకపోవటంతో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. చిన్నారులను పోషించేందుకు ఆ వృద్ధురాలికి పింఛను తప్ప.. మరో ఆధారం లేదు. కాగా.. తాను ఎంతకాలం జీవిస్తానో తెలియదని,.. తన తదనంతరం పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని ఆమె చింతిస్తోంది. చిన్నారుల దయనీయ పరిస్థితిని చూసి ఎవరైనా ఆపన్న హస్తం అందిస్తే బావుంటుందని ఆ వృద్ధురాలు కోరుకుంటోంది.
కాగా చిన్నారుల పరిస్థితిని తెలుసుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు వారి ట్రస్టు ద్వారా రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతోపాటు ఆ చిన్నారులకు దుస్తులు, బొమ్మలు, చాక్లెట్లు అందించారు. చిన్నారుల చదువు, బాగోగులను ట్రస్టు ద్వారా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. చిన్నారుల దయనీయ పరిస్థితిని చూసి.. వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన రాజగోపాల్‌రెడ్డి దంపతులను గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి: