వృక్షాలను మనం రక్షిస్తే అవే మనల్ని రక్షిస్తాయన్నది పెద్దలమాట. అయితే నెల్లూరు నగరంలో మాత్రం అభివృద్ధి పేరుతో దశాబ్దాల నాటి చెట్లు నేలకూలుతున్నాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులో రహదారికి ఇరువైపులా ఉన్న వృక్షాలు ఆహ్లాదకర వాతావరణం అందించడమే కాకుండా ప్రయాణికులకు నీడనిచ్చేవి. 50, 60 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు భారీ వృక్షాలై బాటసారులకు సేదతీర్చాయి. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం రోడ్డు విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టడంతో, దశాబ్దాల వయసున్న వృక్షాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
పొదలకూరురోడ్డు లోని డి.కె.డబ్ల్యూ. కళాశాల నుంచి డైకస్ రోడ్డు వరకు రహదారి విస్తరణ పనులను అధికారులు రెండేళ్ల క్రితమే చేపట్టారు. దాదాపు పది కోట్ల రూపాయల వ్యయంతో అప్పట్లో పనులు ప్రారంభించిన అధికారులు, ఓ వైపు చెట్లను తొలగించి పనులు పూర్తి చేశారు. నగరంలో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో అప్పట్లో ఈ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం తిరిగి ఈ పనులు ప్రారంభించిన ఆర్. అండ్ బి. అధికారులు విస్తరణ కొసం భారీ వృక్షాలను నెలకొల్చుతున్నారు. ఏళ్ల తరబడి నీడనిచ్చిన వందలాది చెట్లును యంత్రాలతో పెకలించేయడంతో అవి నిర్జీవంగా దర్శనమిస్తున్నాయి. దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్లపై పడి ఉన్న ఈ చెట్లను చూస్తున్న ప్రకృతి ప్రేమికులు తమ ఆవేదనను వెలుబుచ్చుతున్నారు.
ట్రాఫిక్ రద్దీని నివారించేందుకే...