Tirumalammapalem: స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లోనే పాఠశాల తీరప్రాంత గ్రామం.. తిరుమలమ్మపాళెం. తీవ్రంగా వెనుకబడిన ప్రాంతం.. ఆలోచనలు ఆదర్శం.. సారా నిషేధం. మద్యం దుకాణం లేని గ్రామం. చదువుకోవాలనే చైతన్యం.. చదువులమ్మపాళెం.. తిరుమలమ్మపాళెం అంటే నెల్లూరు జిల్లాలో తెలియని వారంటూ లేరు. చదువులమ్మపాళెం తిరుమలమ్మపాళెం అనే నానుడి. సముద్ర తీరం గ్రామం. అభివృద్ధిలో వెనుకబడినా ప్రతి ఇంటిలో సరస్వతీ కొలువుతీరి ఉంది. చదువు జీవితాలను మారుస్తుందని స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే పాఠశాలకోసం పోరాటంచేసి సఫలమయ్యారు. మద్యానికి దూరం ఆ గ్రామం. అనేక మంది ఉద్యోగులు. వైద్యులు. ఇంజనీర్లు ఉన్న వెంకటాచలం మండలంలోని ఆదర్శ గ్రామంపై ప్రత్యేక కథనం.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మపాళెం తీరప్రాంత గ్రామం. నేటికి అభివృద్ధికి నోచుకోని గ్రామం. ఈ గ్రామస్థులు అభివృద్ధి పనులకన్నా పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వాన్ని నిందించరు.. పొలం పనుల్లో ఉంటారు. పంటలు పండించుకుంటూ పిల్లలను చదివించుకుంటారు. ఉన్నతంగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముతారు.. మారుమూల గ్రామమైనా ఇక్కడ విద్యావంతుల సంఖ్య అత్యధికం. అక్షరాస్యత సుమారు 90పైనే ఉంటుందని ఆ గ్రామాన్ని చూస్తే ఎవరూ నమ్మరు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే పోరాటం చేసి పాఠశాలను తెచ్చుకున్నారు. దానితో ఆ గ్రామంలోని ప్రజల పరిస్ధితి మారిపోయింది. చుట్టూ కర్రలతో రక్షణ గాదడులు కట్టుకుని ఉంటారు. మట్టి ఇళ్లు ఎక్కువ కనిపిస్తాయి. తక్కువగా మిద్దేఇళ్లు ఉంటాయి.