నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా చికిత్సకు ఆయుర్వేదం కోసం జనం పోటెత్తారు. పెద్దసంఖ్యలో వాహనాలపై తరలి రావటంతో..ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. గందరగోళ పరిస్థితుల్లో ఇవాళ్టికి మందుల పంపిణీ నిలిపివేసినట్లు పోలీసుల ప్రకటించారు. మందుల పంపిణీ నిలిపివేతతో ప్రజలు వెనుదిరిగారు.
కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో జనం పోటెత్తటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వందలాదిగా ప్రజలు తరలిరావటంతో..కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పెద్దసంఖ్యలో జనం రావడంతో క్యూలైన్ల వద్ద తోపులాట జరిగింది. సందిగ్ధ పరిస్థితుల్లో ఇవాళ్టికి మందుల పంపిణీ నిలిపివేసినట్లు పోలీసుల ప్రకటించారు. మందుల పంపిణీ నిలిపివేత ప్రకటనతో ప్రజలు వెనుదిరిగారు.
ఔషధం పంపిణీలో గందరగోళం
ఆయుర్వేద ఔషధం పంపిణీలో గందరగోళం, అయోమయం నెలకొంది. ఔషధ పంపిణీ నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయగా..పంపిణీ కొనసాగించాల్సిందేనని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఔషధం కోసం అంబులెన్సుల్లోనూ రోగులను తీసుకురాగా..కరోనా పాజిటివ్ రోగులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఉచితంగా ముందు పంపిణీ
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో...వనమూలికలు, ఇతర పదార్థాలతో తయారు చేస్తున్న ఈ ఔషధాన్ని ఆనందయ్య అనే వ్యక్తి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అల్లం, తాటిబెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు, మామిడి చిగుళ్లు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయులు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింటి ఆకుల చెట్టు, తెల్లజిల్లేడు, పూలమొగ్గలు, ముళ్ల వంకాయలతో మందు తయారు చేసినట్లు..ఆనందయ్య తెలిపారు. ఔషధం తీసుకున్న వారికి కరోనా వ్యాధి తగ్గుతోందనే ప్రచారంతో..జనం ఎగబడ్డారు.
వైద్యారోగ్యశాఖ క్షేత్రస్థాయి పరిశీలన
ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు కోసం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా...తమిళనాడు, తెలంగాణ నుంచీ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆనందయ్య పంపిణీ చేసే మందుపై వైద్యారోగ్యశాఖ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఔషధం పనిచేసే విధానంపై రోగులతో వైద్యుల బృందం మాట్లాడింది. ఔషధం శాస్త్రీయంగా నిరూపణ కావాలని లోకాయుక్తకు నివేదిక సమర్పించింది. చికిత్స అనంతరం పరిణామాలపై అధ్యయనం చేయాలని నివేదికలో వెల్లడించింది. మందు లభించే ప్రదేశంలో కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని స్పష్టం చేసింది.
దృష్టి సారించిన ముఖ్యమంత్రి
ఆయుర్వేద మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా ? వద్దా ? అన్న అంశంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని తెలుసుకోనున్నారు. అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై చర్చించి..పంపిణీకి అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీచదవండి
కరోనాకు ఆయుర్వేద మందు.. తిరిగి పంపిణీకి సన్నాహాలు