ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2021, 8:26 AM IST

ETV Bharat / state

ఓటరు చైతన్యం... పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బారులు

నెల్లూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటింగ్​లో పాల్గొన్నారు.

nellore district panchayati elections
నెల్లూరు పంచాయతీ ఎన్నికలు

నెల్లూరు జిల్లాలో మూడో దశ పంచాయతీ పోరు ప్రశాంతంగా సాగింది. నాయుడుపేట, గూడూరు డివిజన్లలోని 15 మండలాల్లో 83.31 శాతం ఓట్లు పోలయ్యాయి. పలువురు ప్రజాప్రతినిధులతో పాటు యువత, వృద్ధులు, మహిళలు పెద్దఎత్తున పోలింగ్‌లో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 6.30కి మొదలైన ప్రక్రియ తొలుత మందకొడిగా సాగింది. మొదటి రెండు గంటల్లో కేవలం 9.1 శాతం మాత్రమే నమోదైంది. అనంతరం క్రమేపీ పుంజుకుని మధ్యాహ్నం 3.30 వరకు జరిగింది. పోలింగ్‌ ముగిసే సమయానికి 83.31 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. రెండు డివిజన్లలో 267 సర్పంచి, 1906 వార్డు స్థానాల పరిధిలో 3,62,488 మంది ఓటర్లు ఉండగా- 3,02,006 ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం 1 గంటకే పోలింగ్‌ ముగిసింది. మరికొన్ని చోట్ల 3.30 దాటినా.. అప్పటి వరకు లైన్‌లో నిలుచున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కోట పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే మండలం వెంకన్నపాలెంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు ఓటేశారు.

పర్యవేక్షణ భేష్‌

జిల్లాలో 150 కేంద్రాల్లో పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించారు. ఓజిలి, సూళ్లూరుపేట, చిల్లకూరు మండలాల్లో కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పర్యటించారు. పోలింగ్‌ సరళిని పరిశీలించి.. ఏమైనా సమస్యలున్నాయా అని ఓటేసేందుకు వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. వెంకటగిరి మండలం పెద్దూరు, నెల్లబల్లిలో పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు బసంత్‌కుమార్‌ పరిశీలించారు. సబ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ, ఆర్డీవో సరోజిని గంట గంటకు పోలింగ్‌ సరళిని పరిశీలించగా- గూడూరు డీఎస్పీ ఎం.రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో సమస్యాత్మక గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిట్టమూరులో గరిష్ఠం.. కోటలో కనిష్ఠం

15 మండలాల్లోని 342 పంచాయతీల్లో 267 చోట్ల పోలింగ్‌ జరిగింది. 75 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9.30 గంటలకు 24.02 శాతం నమోదైన పోలింగ్‌.. ముగిసే సమయానికి 83.31కి పెరిగింది. మొదటి విడతలో 80 శాతం, రెండో విడతలో 78.15 శాతం నమోదవగా- మూడో విడతలో అయిదు శాతం పెరిగింది. అత్యధికంగా చిట్టమూరు మండలంలో 87.31, అత్యల్పంగా కోట మండలంలో 78.18 శాతం నమోదైంది.

  • కోట మండలం కేశవరం పంచాయతీ ఓటర్ల జాబితాలో 60 మందిని అదనంగా చేర్చారంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మేరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు నిర్ధరించారు.
  • నాయుడుపేట మండలం మందబైలు ఎస్సీ కాలనీలో ఏర్పాటు కేంద్రంలో ఉదయం 8 గంటలకే 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • సూళ్లురుపేట మండలం మంగళంపాడులో మూడో వార్డు పోలింగ్‌ అధికారి ఓటరుకు రెండు బ్యాలెట్‌ పత్రాలు ఇవ్వడంపై వివాదం నెలకొంది. దాన్ని చూసిన ఓ ఏజెంట్‌ అభ్యంతరం తెలపడంతో కొంత సేపు ఓటింగ్‌ ప్రక్రియ నిలిచింది. అధికారులు పొరపాటున వెళ్లాయని చెప్పడంతో వివాదం సద్దుమనిగింది.

ఇదీ చదవండి:పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details