ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త ఏడాదిలో ఇస్రో ప్రయోగాలపై సర్వత్రా ఆసక్తి - భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజా వార్తలు

కొత్త ఏడాదిలో అడుగుపెట్టాం. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళుతున్నాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆ దిశగా కసరత్తు చేస్తోంది. 2020లో కరోనా కష్టాలను అధిగమించి రెండు ప్రయోగాలను పూర్తి చేసింది. 2021లో మరిన్ని వాహక నౌకలను నింగిలోకి పంపి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాదిలో తొలి ప్రయోగం ఏదన్న దానిపైన మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. గత ఏడాదిలో నిలిచిపోయిన జీఎస్‌ఎల్వీపై దృష్టి సారిస్తారా? పీఎస్‌ఎల్వీ సి-51, ఎస్‌ఎస్‌ఎల్వీని ప్రయోగించేందుకు సన్నద్ధమవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రతి ప్రయోగానికి ప్రత్యేకం ఉండటం విశేషం.

ISRO
ఇస్రో

By

Published : Jan 15, 2021, 1:47 PM IST

దశాబ్దన్నరగా వరుస విజయాలతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ దూసుకువెళుతోంది. తన విజయాశ్వం పీఎస్‌ఎల్వీ ద్వారా స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి పంపుతోంది. చంద్రయాన్‌-2 వంటి భారీ ప్రాజెక్టులను భుజానికెత్తుకుని సత్తా చాటింది. 2020లో అంతకు మించి రికార్డు సృష్టించాలని ఛైర్మన్‌ డాక్టర్‌ శివన్‌ ఉవ్విళ్లూరారు. కరోనా ప్రభావం... నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోటలో ఉన్న షార్‌తో పాటు అన్ని ప్రధాన కార్యాలయాలపైన పడటం ఇబ్బందిగా మారింది. ఓ దశలో షార్‌లోనూ లాక్‌డౌన్‌ ప్రకటించగా... రెండు నెలల పాటు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే చివరి మూడు నెలల్లో మూడు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... చాలా కష్టపడి రెండింటిని సాకారం చేసుకుంది.
అవి రెండూ కీలకం...
గత ఏడాది మార్చిలో జీఎస్‌ఎల్వీ ద్వారా జీశాట్‌ ఉపగ్రహాన్ని కక్షలోకి పంపాలని నిర్ణయించారు. ఆ మేరకు తేదీని ప్రకటించగా.. అనూహ్యంగా వాయిదా పడింది. ఉన్నత స్థాయిలో అనుమతి లభించకపోవడం వల్లే నిలిచిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని చేపట్టే దిశగా శాస్త్రవేత్తలు అడుగేస్తున్నట్లు షార్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు ఇస్రో సరికొత్తగా రూపొందించిన చిన్న ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీని నింగిలోకి పంపేందుకూ యోచిస్తున్నారు. కొత్త ఏడాదిలో తొలి ప్రయోగం కావడంతో విజయావకాశాలు మెండుగా ఉండే ప్రాజెక్టునే ఎంచుకునే దిశగా అధికారులు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కలిసొచ్చిన కాలం
ఛైర్మన్‌ శివన్‌ పదవీ కాలాన్ని తాజాగా పొడిగించం కలిసొచ్చినట్లయింది. ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే బ్రెజిల్‌కు చెందిన ఓ ఉపగ్రహం శ్రీహరికోటకు చేరిన నేపథ్యంలో దానికి వివిధ పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో విధులకు హాజరవుతున్నారు.
ప్రత్యేక రికార్డు
2021లో అనేక కీలక ప్రాజెక్టులను చేపట్టబోతున్నట్లు శివన్‌ గత ఏడాది చివర్లో ప్రకటించారు. చంద్రయాన్‌-3తో పాటు గగనయాన్‌ ఆ జాబితాలో ఉన్నట్లు స్పష్టం చేశారు. పిక్సెల్‌ ఉపగ్రహం ప్రత్యేకంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. వచ్చే నెలలో ప్రయోగం చేపట్టే అవకాశం ఉంటుందన్న చర్చ షార్‌ వర్గాల్లో వినిపిస్తుంది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌ వాహక నౌక ప్రయోగిస్తారా? విభిన్నంగా ముందుకెళతారా అన్నది ఆసక్తిగా మారింది.

ABOUT THE AUTHOR

...view details