నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట పురపాలక సంఘం రాజకీయంగా కీలకమైన ప్రాంతం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. 23 వార్డులతో 2012లో ఈ పురపాలక సంఘం ఏర్పడగా.. 52వేల జనాభా 34వేల మంది ఓటర్లు ఉన్నారు. కానీ వసతులపరంగా సూళ్లురుపేట పురపాలక సంఘం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కనీస సౌకర్యాలు లేవు. ఇరుకురోడ్లు, నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు వెంటాడుతున్నాయి.
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రానికి వెళ్లాలంటే సూళ్లూరుపేట నుంచే వెళ్లాలి. సమీపంలోనే శ్రీసిటీ, అపాచీ పరిశ్రమ, అనేక సెజ్ లు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందినా సరైన రహదారులు మాత్రం లేవు. ఉద్యోగాలు చేసుకునే వారు వేలాది మంది సూళ్లూరుపేటలోనే నివాసాలు ఉంటారు. వీరంతా సమస్యలతో సతమతం అవుతున్నారు.
డేగలపాలెం, నూతపాలెం గ్రామాలను ఇటీవల సూళ్లురుపేటలో కలిపారు. విశాలమైన పట్టణంలో శివారు కాలనీలు మాత్రం తీసికట్టుగా ఉన్నాయి. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ ప్రాంతాల్లో ఉప్పునీరు వస్తుంది. 148కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మురుగు నీరు పారుదల లేదు. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చినా రహదారుల పనులు ప్రారంభం కాలేదు.