ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రిగారి కేసు.. కోర్టులో దొంగలు పడ్డారు - నెల్లూరు కోర్టులో దొంగతనం

కోర్టు సముదాయంలో చోరీ
కోర్టు సముదాయంలో చోరీ

By

Published : Apr 14, 2022, 9:02 PM IST

Updated : Apr 15, 2022, 2:04 PM IST

20:59 April 14

కేసుకు సంబంధించిన ఆధారాలు ఎత్తుకెళ్లిన దుండగులు

మంత్రిగారి కేసు.. కోర్టులో దొంగలు పడ్డారు

Theft in Court: నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్​ స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో బుధవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకువెళ్లారు. గురువారం ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో.. సమీపంలోని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. దీనిపై చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ వీరేంద్రబాబును అడగ్గా.. కోర్టులో దొంగతనం జరిగిన మాట వాస్తవమని, దానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

అపహరణకు గురైన పత్రాలు అవేనా?: సర్వేపల్లి ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2017లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై విలేకర్ల సమావేశంలో పలు విమర్శలు చేశారు. వివిధ పత్రాలు చూపించి హవాలాకు పాల్పడ్డారని ఆరోపించారు. దానిపై సోమిరెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి తనపై బురద జల్లుతున్నారని కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేేశారు. ఈ కేసు విచారణ 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్‌ మణిమోహన్‌ (పాస్‌పోర్టు ప్రకారం) ఆ కేసులో నకిలీ పత్రాలు రూపొందించినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు లభ్యమైన పత్రాలు చిరంజీవికి చెందినవని గుర్తించినట్లు సమాచారం. కోర్టు విషయంతో పాటు.. కీలక కేసుతో సంబంధం ఉండటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి: వృద్ధుడి ఖాతాలోంచి నగదు కొట్టేసిన వాలంటీర్​.. విషయం తెలియడంతో ఏం చేశాడంటే?!

Last Updated : Apr 15, 2022, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details