ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చినా... బాధితుడు రెండేళ్లు జైల్లోనే... - The Supreme Court has fired an additional sessions judge in Nellore district

నెల్లూరుజిల్లాలోని ఓ అదనపు  సెషన్స్‌ జడ్జిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అలా అర్థం చేసుకోవడాన్ని బట్టిచూస్తే సదరు న్యాయాధికారికి జ్యుడిషియల్‌ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఇచ్చారో అర్థం కావడంలేదన్నారు. ఆ పెద్దమనిషి ఎవరన్నది తాము తెలుసుకోవాలనుకుంటున్నామని జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేర్కొన్నారు.

Supreme Court
Supreme Court

By

Published : May 10, 2022, 4:57 AM IST

సుప్రీంకోర్టు జారీచేసిన బెయిల్‌ ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోకుండా, జైల్లో ఉన్న ఖైదీని విడుదల చేయడంలో జాప్యం చేసిన నెల్లూరు జిల్లాలోని ఓ అదనపు సెషన్స్‌ జడ్జిపై సుప్రీంకోర్టు మండిపడింది. తమ ఉత్తర్వులను అలా అర్థం చేసుకోవడాన్ని బట్టిచూస్తే సదరు న్యాయాధికారికి జ్యుడిషియల్‌ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఇచ్చారో అర్థం కావడంలేదన్నారు. ఆ పెద్దమనిషి ఎవరన్నది తాము తెలుసుకోవాలనుకుంటున్నామని జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేర్కొన్నారు.

ఇలాంటి వారు కోర్టులకు నేతృత్వం వహిస్తుండటం విచారకరమన్నారు. కోర్టు బెయిల్‌ ఇచ్చినా న్యాయాధికారి వైఖరితో బాధితుడు రెండేళ్లు జైల్లోనే ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అధికారి వైఖరి చూస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ హింస, భార్యను హత్య చేసిన కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో తొమ్మిదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తి బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

హరికృష్ణను మూడు రోజుల్లో ట్రయల్‌ కోర్టులో ప్రవేశపెట్టడంతో పాటు బెయిల్‌ మంజూరు చేయాలని 2020, సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. అవి అమలు కాలేదు. ఎట్టకేలకు గత నెల 20న హరికృష్ణను విడుదల చేశారు. సోమవారం నాటి విచారణలో గతంలో కోర్టు ఉత్తర్వుల తదనంతరం పరిణామాలను ధర్మాసనం గుర్తు చేసింది. ‘2020, సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఆర్డర్‌ జారీచేసింది. పిటిషనర్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని స్పష్టంగా చెప్పినా విడుదల చేయకుండా జైల్లోనే ఉంచారు. ఖైదీ విడుదలలో జాప్యంపై పోలీసులు, జైలు అధికారుల నుంచి సర్వోన్నత న్యాయస్థానం సంజాయిషీ కోరింది.

బెయిల్‌ ఆర్డర్‌ తమకు ఆలస్యంగా అందిందని, ఆ తర్వాత కొవిడ్‌ ఆంక్షలతో ఖైదీలను తరలించడం సాధ్యం కాలేదని నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌ తెలిపారు. ఖైదీ తరఫున దాఖలు చేసిన బెయిల్‌ అప్లికేషన్‌ 2020 అక్టోబరు 29న ట్రయల్‌ కోర్టు ముందుకు వచ్చింది. అయితే (మూడు రోజుల్లోపు అతన్ని కోర్టులో హాజరుపరచలేదు కాబట్టి తర్వాత విడుదల చేయడం సాధ్యం కాదని) ఆ కోర్టు ఉత్తర్వుల కారణంగా సుప్రీంకోర్టు బెయిల్‌ ఉత్తర్వులు ఇచ్చినా అతడు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. మూడు రోజుల తర్వాత పిటిషనర్‌కు బెయిల్‌ పొందే హక్కులేదని ట్రయల్‌ కోర్టు అర్థం చేసుకోవడం మాకు ఆశ్చర్యం కలిస్తోంది. దీనిపై ఏపీ హైకోర్టు సంబంధిత న్యాయాధికారి నుంచి సంజాయిషీ అడిగి, పరిపాలనాపరంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం. ఇలాంటి అంశాల పరిశీలన కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. సుప్రీంకోర్టు జారీచేసిన బెయిల్‌ ఉత్తర్వులు ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో హైకోర్టు నివేదిక ఇవ్వాలి. అలాంటి కేసులను ఆ తర్వాతి నెలలోనే సంబంధిత కోర్టు ముందు ఉంచి బెయిల్‌పై విడుదల కాని వారికి ఉపశమనం కలించాలి’ అని జస్టిస్‌ లలిత్‌ ఆదేశించారు. వివరాలను ఆరువారాల్లోపు సమర్పించాలని ఏపీ హైకోర్టును ఆదేశిస్తూ తదుపరి విచారణను జులై 11కి వాయిదావేశారు.

ఇదీ చదవండి:"నిబంధనలు ఉల్లంఘిస్తారా..?" రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details