"పేదల ఇళ్లు కూల్చివేస్తుంటే ఏం చేస్తున్నారు?'' శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో
బాలకృష్ణ రెడ్డి నగర్లో జాతీయ ఎస్సీ, బీసీ కమిషన్ సభ్యులు సందర్శించారు. ఇటీవలే అక్కడి ఇళ్లు కూల్చేయడంతో బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు దగ్గరుండి ఇళ్లు కూల్చడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ శ్రీధర్‌ను దీనిపై ప్రశ్నించారు. ఈ విషయం తమకు సంబంధం లేనిదని.. ప్రైవేట్ వ్యక్తులు ఈ పనిచేశారని సబ్ కలెక్టర్ బదులిచ్చారు. పేదలను ఖాళీ చేయించిన స్థలం ప్రైవేటుదా, ప్రభుత్వానిదా తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరైనా నకిలీ పత్రాలతో అమ్ముకుంటే వారిపై చర్యలు తీసుకునే అధికారం రెవెన్యూ, పోలీసులకు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న స్థలం ఎవరిదనే వివరాలు అధికారులు తెలియజేయాలని ఆదేశించారు. పేదల ఇళ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చి చేయడాన్ని తప్పుబట్టారు. ప్రైవేట్ స్థలం అని తెలిసినా పేదలు ఇళ్లు కట్టుకుంటుంటే అధికారులు ఎందుకు చూస్తూ ఉండిపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు ఇళ్లు కూల్చి వేస్తే మళ్లీ కట్టుకునేందుకు వారికి డబ్బులు ఎలా వస్తాయని నిలదీశారు. దీనిపై చాలా లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాధితుల ఇళ్లు కూల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కావలి డీఎస్పీకి సూచించారు.