బాలిక మృతదేహం లభ్యం - nellore district newsupdates
నాయుడుపేట పురపాలక సంఘం తమ్మూరు వద్ద స్వర్ణముఖి నదిలో గల్లంతైన బాలిక మృతదేహాన్ని అధికారులు, స్థానికులు గుర్తించారు. బాలిక ప్రవల్లిక తల్లిదండ్రులు నిరుపేదలు కావటంతో అంత్యక్రియలు చేయలేకపోవటంతో అధికారులే చేశారు.
పట్టణంలో స్వర్ణముఖి కాజ్‌వేపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నదిలో పడి గల్లంతయిన బాలిక మంగళపూరి ప్రవల్లిక మృతదేహం లభించింది. ప్రమాదం జరిగిన స్థలానికి ఐదు కి.మీ దూరంలోని నదీ తీరంలో మృతదేహం ఒడ్డుకు చేరి ఉండడాన్ని పోలీసులు, యువకులు గుర్తించారు. పోలీసులు, గరిడీవీధికి చెందిన కొందరు యువకులు కలిసి నదీ తీరంలోని అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా తుమ్మూరుకు దగ్గర నదీ తీరాన బాలిక మృతదేహం ఉండడం గుర్తించి...పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కన్న కూతురు కళ్ల ఎదుటే నదిలో గల్లంతై నాలుగు రోజుల అనంతరం శవమై కనిపించడం తల్లిదండ్రులను వేదనకు గురిచేసింది. బాలిక మృతదేహాన్ని పురపాలకశాఖ కమిషనర్ ఎల్.చంద్రశేఖర్‌రెడ్డి, పారిశుద్ధ్య సిబ్బంది శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు. బాలిక ఆచూకీ కోసం కృషి చేసిన యువకులను సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై డి.వెంకటేశ్వరావు అభినందించారు.