ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిలికా శాండ్‌ తవ్వకాలకు టెండర్ల ఆహ్వానం - సిలికా శాండ్‌ తవ్వకాలకు టెండర్లు

సిలికా శాండ్‌ ఖనిజ తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించింది. నెల్లూరు జిల్లాలోని రూ.500 కోట్ల విలువైన దీనికోసం పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.

silica sand mining
silica sand mining

By

Published : Jun 24, 2020, 9:29 AM IST

నెల్లూరు జిల్లాలోని రూ.500 కోట్ల విలువైన సిలికా శాండ్ ఖనిజ తవ్వకాలకు ఏపీఎండీసీ గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. కోట, చిల్లకూరు మండలాల పరిధిలోని ఏపీఐఐసీకి చెందిన దాదాపు 250 హెక్టార్లలో ఈ సిలికా శాండ్‌ను తవ్వనున్నారు.

దాదాపు 85 లక్షల టన్నుల నిల్వలున్నాయని అంచనా వేస్తున్నారు. సగటున 5 హెక్టార్లలో ఒక్కో లీజు ప్రాంతం చొప్పున మొత్తం 47 లీజు ప్రాంతాలను ఎంపిక చేశారు.

నాలుగు దశల్లో తవ్వకాలు చేయనుండగా, తొలి దశలో 11 ప్రాంతాలకు పర్యావరణ అనుమతులు తీసుకుంటున్నారు. టెండర్ల గడువు బుధవారంతో ముగియనుండగా పలు సంస్థల విజ్ఞప్తితో గడువు పెంచనున్నారు.

సిలికా ఖనిజానికి గ్లాస్‌, సిరామిక్స్‌, పెయింట్స్‌, టైల్స్‌ పరిశ్రమల్లో డిమాండ్‌ ఎక్కువ. టెండర్లు దక్కించుకునే గుత్తేదారు సంస్థ ఆ భూముల్లో రెండు మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వితీస్తుంది.

దీనిని శుద్ధిచేసి, విక్రయించే బాధ్యతనూ గుత్తేదారు సంస్థే చూసుకోవాల్సి ఉంటుంది. టన్నుకు రూ.200 చొప్పున కనీస ధరగా టెండరులో పేర్కొన్నారు. మొత్తంగా సగటున టన్నుకు రూ.600పైనే టెండర్‌లో ధర కోట్‌ అయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. నాలుగేళ్లపాటు జరిగే ఈ తవ్వకాలతో ఏపీఎండీసీకి రూ.150 కోట్లపైనే ఆదాయం వస్తుందని అంచనా.

త్వరలో రోబోశాండ్‌కు అనుమతులు

రాష్ట్రంలో త్వరలోనే రోబోశాండ్‌కు అనుమతులు ఇవ్వనున్నట్లు గనులశాఖ మంత్రి పి.రామచంద్రారెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మైనింగ్‌ పాలసీలపై అధ్యయనం చేసి, వాటిలో ఉత్తమమైనది ఇక్కడ అమలు చేస్తామని అన్నారు. గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం విజయవాడలోని మంత్రి రామచంద్రారెడ్డి, గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. కొవిడ్‌ వల్ల మూడునాలుగు నెలలుగా ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇవ్వాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:భారత సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి!

ABOUT THE AUTHOR

...view details