Tdp Spokesperson Neelayapalem Vijaykumar : ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే దేశంలో మొట్టమొదటి సారి అప్పు చేసిన రాష్ట్రం ఏపీనే అని టీడీపీ విమర్శించింది. రాష్ట్రంలో 16.4 శాతం వృద్ధి అంటూ రాష్ట్ర బడ్జెట్‌లో చూపిస్తూ వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోతోందని.. వాస్తవ పరిస్థితులు అలా కనిపించటం లేదని ఆరోపించింది. వృద్ధిరేటు ఎక్కడా కనిపించకుండా బడ్జెట్‌లో చూపించడం హాస్యాస్పదమని అభిప్రాయపడింది. రాష్ట్ర ఆదాయం పూర్తిగా మద్యం పైనే ఆధారపడి ఉందని తెలిపింది. ఖర్చు పెట్టనిదే వృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నించింది.
మద్యంపై ఆదాయం పెంచుకోవడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ విమర్శించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుత్తేదారులకు బిల్లులు ఇవ్వటంలేదని.. బిల్లులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధే లేనప్పుడు రాష్ట్రంలో వృద్ధి ఎలా వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు లేక.. స్థిరాస్తి రంగం పడిపోయిందని ఎద్దెవా చేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చిందని విమర్శలు చేశారు.
తెలుగుదేశం హయాంలోనే 54 లక్షల పింఛన్లు ఇచ్చామని విజయకుమార్ తెలిపారు. కొత్త సామాజిక పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా అని వైసీపీని ప్రశ్నించారు. ఇంతకు ముందెప్పుడూ లేనట్లు కొత్తగా వీళ్లే తెచ్చినట్లు ఊదరగొడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు ప్రభుత్వం సమయానికి జీతాలు అందించలేకపోతోందని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. దానివల్ల రోడ్లు, తాగునీటి వసతులు వంటి సౌకర్యాలను రాష్ట్రంలో ప్రభుత్వం అందించలేక పోతోందని విమర్శించారు.