TDP Senior Leader Somireddy angry with CM Jagan: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. మూడవ రోజు (శుక్రవారం) తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాకినాడ జిల్లా అనపర్తిలో పర్యటించకుండా పోలీసులు అడ్డుపడ్డారు. మొదట పర్యటనకు అనుమతించిన పోలీసులు.. మధ్యాహ్న సమయానికి అనుమతిని నిరాకరిస్తూ.. దేవీచౌక్ సెంటర్‌కు పెద్ద ఎత్తున చేరుకుని జులుం ప్రదర్శించారు. బారికేడ్లతో సభా ప్రాంగణాన్ని దిగ్బంధించి.. దారికి అడ్డంగా బస్సులు నిలిపారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, వాహనాలు పెట్టి పోలీసులే రోడ్డుపై బైఠాయించారు. ఎందుకిలా చంద్రబాబు పర్యటనకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించిన కార్యకర్తలపై.. కర్కశంగా లాఠీచార్జీ చేశారు. ఆ తర్వాత మైకులను తొలగించి, లైట్లను ఆపేసి నానా రచ్చ చేశారు.
అనపర్తిలో పోలీసులు చంద్రబాబు పట్లు వ్యవహరించిన తీరుపై..టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. జగ్గంపేట, పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేకే.. అనపర్తిలో అడ్డంకులు సృష్టించారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడే.. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడింది. చంద్రబాబు నాయుడిగారి సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేకే.. అనపర్తిలో అడ్డంకులు సృష్టించారు. ఏపీలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగుతోంది. నియంతపాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి.. ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరపడింది.-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు