Somireddy Fired on Nellore District YSRCP Leaders: వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు బయటపడతాయనే ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. మా పోరాటం ప్రభుత్వ ఉద్యోగులందరిపై కాదు.. అవినీతి, అక్రమాల్లో వైఎస్సార్సీపీ నేతలతో చేతులు కలిపిన కొందరిపైనే అని తెలిపారు.
నెల్లూరులో సిలికా, నుడా, అక్రమ లేఅవుట్లు, ఇరిగేషన్‌లోని కొందరు అధికారులు మాత్రమే.. వైసీపీ నేతలతో చేతులు కలిపారని చెప్పానన్నారు. ఇందులో ఎటువంటి తప్పు లేదని.. వేల కోట్ల ధనం ప్రభుత్వం, ప్రజలు నష్ట పోతున్నారని.. కాబట్టే అలా అన్నానని స్పష్టం చేశారు.
సాక్షాత్తు సాక్షి పత్రికలోనే మీ అక్రమాల గురించి రాశారని తెలిపారు. కీలక శాఖలు కాసులు తీసుకొని మౌనంగా ఉంటున్నారని రాశారని గుర్తు చేశారు. సుమారు 210 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని అన్నారు. ఉద్యోగులపై గౌరవం లేకుండా తాను మాట్లాడలేదని.. కొంత మంది అధికారుల గురించి మాత్రమే చెప్పానన్నారు.
ఉద్యోగులు వివిధ అంశాలపై పోరాటాలు చేసిన సందర్భంలో వారి శిబిరాలకు వెళ్లి మద్దతు పలికాం అని గుర్తు చేశారు. జిల్లాలో లేఅవుట్లు, ఇరిగేషన్ పనులు, సిలికా మైనింగ్‌లో జరుగుతున్న దోపీడీపై పోరాటం చేస్తామనగానే మంత్రి కాకాణి ఉలిక్క పడుతున్నారని అన్నారు. నుడా, ఇరిగేషన్, మైనింగ్ శాఖల్లోని కొందరు అధికారుల సహకారంతో వైఎస్సర్సీపీ నేతలు అక్రమాలకు పాల్పడటం ముమ్మూటికీ నిజం అన్నారు.