పులిచింతల ప్రాజెక్ట్ విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. ఎంతో మంది దిగ్గజాలు జలవనరుల శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని.. కానీ మంత్రి అనిల్ మాత్రం జలవనరుల శాఖను ధనవనరుల శాఖగా మార్చారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పులిచింతల ప్రాజెక్టుకు 33 గేట్లు పెట్టాల్సి ఉంటే.. 24 గేట్లు పెట్టి డబ్బులు మిగుల్చుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఆ గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం అధోగతి పాలైందని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. పదవిని కాపాడుకునేందుకు మంత్రి అనిల్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.