నెల్లూరు వద్ద పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి, నేడు అఖిలపక్ష సమావేశమంటూ మంత్రి అనిల్ డ్రామాలాడుతున్నారని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లిన ఆయన... ఇసుక రవాణాపై అధికారులను ప్రశ్నించారు. అనుమతి లేకుండా తవ్వకాలు జరుగుతుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎస్ఈని అడిగారు. మట్టి తవ్వకాలకు అనుమతిచ్చామంటున్న అధికారులు, క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో పట్టించుకోరా అని నిలదీశారు.
రోజూ వంద ట్రాక్టర్లు, 50 టిప్పర్లతో రాత్రి సైతం ఇసుక తరలించారని... 100కోట్లు విలువ చేసే ఇసుకను ఇతర ప్రాంతాలకు పంపిచారన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మంత్రి అనిల్ అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. వంద కోట్ల విలువైన ఇసుక తరలించారని నిరూపిస్తామన్నారు. ప్రజల ఆస్తులను దోచుకుంటున్న ప్రజాప్రతినిధులతో పాటు వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.