నెల్లూరులో జరుగుతున్న సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనుల్లో మంత్రి అనిల్ అవినీతికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. 84 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టినట్లు ముందు ప్రకటించి.. రివైజ్డ్ టెండర్ పేరుతో మరో 15 కోట్లు మంజూరు చేయించుకున్న విషయం ఎందుకు బయట పెట్టడం లేదని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు.
నగరంలోని ఇరిగేషన్ ఎస్ఈని కలిసిన తెదేపా బృందం, సర్వేపల్లి కాలువ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 15 కోట్లు మంజూరు అయిన విషయం ఎందుకు బయట పెట్టలేదని అధికారులను కోటంరెడ్డి నిలదీశారు. మట్టి నమూనా పరీక్షలకు 39 లక్షల రూపాయలు కేటాయించటం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి అనిల్ సహకారంతోనే అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.