జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పేట్రేగిపోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆయన భూమిని తీసుకోకూడదని హైకోర్టు ఉత్తర్వు ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వేధించడం వల్లే వెన్నన్నపాలెంకు చెందిన ఎస్సీ రైతు వెంకటయ్య... విషం తీసుకున్నారని మండిపడ్డారు. రైతు తన భూమిలో పనిచేస్తున్నప్పుడు కానిస్టేబుళ్లు మాటలతో వేధించి శారీరకంగా దాడి చేశారని, అవమానం తట్టుకోలేక పంటకు ఉపయోగించాల్సిన పురుగుమందును రైతే సేవించాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమపై కోర్టుకు వెళ్లిన అన్నదాతపై అధికారులు ప్రతీకారం తీర్చుకోవడం దుర్మార్గమన్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించటమే కాకుండా, శారీరక, మానసిక హింసలకు గురిచేశారని మండిపడ్డారు. మానవ హక్కులను ఉల్లంఘించారని ఆరోపించారు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించకుండా ప్రేక్షక పాత్ర పోషించటం దారుణమన్నారు. వెంకటయ్యకు అండగా నిలబడతామని చంద్రబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తప్పు చేసిన అధికారులకు శిక్షపడే దాకా వదలబోమని హెచ్చరించారు. ఈ అమానవీయ చర్యలను పౌర సమాజం తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు.