SOMIREEDY FIRES ON MINISTER KAKANI : న్యాయస్థానంలో దస్త్రాలు చోరీపై తానే సీబీఐ విచారణ కోరానని కాకాణి కట్టుకథలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కేసును కోర్టు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.. కాబట్టే సీబీఐ విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ అధికారాలు ఎవరికి ఉన్నాయో కూడా మంత్రికి అవగాహన లేదని విమర్శించారు. ఓ ముద్దాయి కోరితే సీబీఐ విచారణ జరగదనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.
జీవితమంతా నేర చరిత్ర ఉన్న కాకాణి.. మీడియా సంస్థలపైనా, చంద్రబాబు పైనా విమర్శలు చేస్తే సచ్చీలుడు కాలేడని ధ్వజమెత్తారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుని, మీడియా సంస్థల్ని నిందించడం తప్ప రైతులకు ఏం చేశాడో కాకాణి చెప్పుకోగలడా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన సమయంలోనే కాకాణిపై కల్తీ మద్యం కేసు ఉందని గుర్తు చేశారు. ఎంతో మంది చావుకు కారణమైన ఈ కేసులో కాకాణి తోటి ముద్దాయిలు అంతర్జాతీయ స్మగ్లర్లు అని ఆరోపించారు.