CBN NELLORE TOUR : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మరో సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న టీడీపీ జోన్ల వారీ ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అధినేత తొలిసారి జిల్లాకు వస్తుండగా.. నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
నెల్లూరులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణంలో సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జోన్-4 పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి క్లస్టర్ ఇన్‌ఛార్జులు, యూనిట్ బాధ్యులు హాజరుకానున్నారు. వీరితో పాటు ఆరు జిల్లాల పరిధిలోని నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. సుమారు 2వేల 500 మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సదస్సులో.. పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు.