Lokesh on theft in Nellore Court: జగన్‌రెడ్డి పరిపాలనలో న్యాయస్థానాలకు సైతం రక్షణ లేకుండాపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కోర్టుల్లో చోరీలతో ఆధారాలను సైతం మాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసు విచారణ ప్రారంభమైతే మంత్రి పదవి పోతుందని భయంతో కాకాణి గోవర్ధన్‌పై నకిలీ పత్రాల కేసు విత్‌డ్రా చేయాలని చూశారని.. అందులో భాగంగానే ఈ చోరీకి పాల్పడినట్లు లోకేశ్ ఆరోపించారు. డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్ దొంగలను కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Payyavula Keshav: నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ కోరారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవ్యవస్థలో ఇలాంటి వాటిని ఆదిలోనే అరికట్టాలని కేశవ్ విజ్ఞప్తి చేశారు. చోరీ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏ-1గా ఉన్న కేసులో పత్రాలు ఎత్తుకుపోయారంటే.. కచ్చితంగా ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. కోర్టులో దొంగతనం జరగడం దేశంలోనే తొలిసారి అని.. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే నేరస్థులకు శిక్షలు పడటం ఎప్పటికీ జరగదన్నారు. వెంటనే నిందితుల బెయిల్ రద్దు చేసి, కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితే తప్ప.. పత్రాలు చోరీ చేసినవారిని పట్టుకోవడం సాధ్యం కాదన్నారు. కొలంబియాలో బాబ్లో ఎస్కోబార్ అనే కరుడుగట్టిన మాఫియా డాన్ మాత్రమే ఇప్పటి వరకు కోర్టుపై దాడి చేశాడని.. అయితే నెల్లూరు ఘటన దాన్ని మరిపిస్తోందన్నారు.
Somireddy on minister kakani: నెల్లూరు కోర్టులో జరిగిన ఛోరీ కేసులో పురోగతి తెలుసుకునేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలోని తెదేపా బృందం.. స్థానిక చిన్నబజారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విధానం, దొంగిలించబడిన డాక్యుమెంట్ల, వస్తువులు వంటివాటిపై పోలీసులను ప్రశ్నించారు. అనంతరం చిన్నబజారు పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రి కాకాణి తనను తాను కాపాడుకునేందుకే కోర్టులో చోరీ చేయించాడని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు జోక్యం చేసుకొని నిందితులకు బెయిల్ రద్దు చేయాలని.. దీనిపై వెంటనే పోలీసులు స్పందించాలని కోరారు. ఈ సంఘటనపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని నెల్లూరు గ్రామీణ, నగర తెదేపా ఇన్ఛార్జీలు హెచ్చరించారు.