చెరువులకు నీరందించే వాగులు.. ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు.. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని పలు వాగులు ఉప్పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవలి వర్షాలకు చినక్రాక జలాశయం కలుజు నుంచి వచ్చే వరద నీటితో జలదంకి వద్దనున్న చిప్పలేరు నిండు కుండలా ప్రవహిస్తోంది. సమీప కమ్మపాలేనికి చెందిన దివ్యాంగుడు మాలేపాటి శ్రీనివాసులు చప్టా మీదుగా జలదంకి వైపు వెళుతూ.. అదుపు తప్పి చిప్పలేరులో గల్లంతయ్యాడు. 4 రోజులు గడిచినా అతని జాడ లేక.. తల్లి వరమ్మ నిద్రాహారాలు మాని కుమారుడి కోసం ఎదురుచూస్తోంది.
వారధులు లేనందువల్లే..
కృష్టాపాడు, చామదల, దాసరి అగ్రహారం, అన్నవరం, చినక్రాక, చామదల, కరకోరిపాలెం గ్రామాల వద్ద వాగులపై వంతెనలు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికితోడు వరదలొస్తే ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అత్యవసర పరిస్థితి వచ్చినా.. రవాణా సదుపాయం లేక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చినక్రాక జలాశయం కలుజుల నుంచి ప్రవహించే వరద నీరు రహదారులపై ప్రవహిస్తున్నదున.. చినక్రాకతో పాటు అన్నవరం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు అవకాశం ఉండటం లేదు. తుపాన్ల ప్రభావంతో కురిసిన వానలకు దాసరి అగ్రహారం వద్దనున్న వాగు పొంగి.. వారం రోజుల పాటు రాకపోకలు లేవని గ్రామస్థులు తెలిపారు. బిట్రగుంట మీదుగా నెల్లూరుకు వెళ్లే రహదారిపై చామదల గ్రామ సమీపంలో నేరేళ్లవాగు నీరు పారి.. కొన్నాళ్లుగా ఆ మార్గంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పాలకులు మారుతున్నా తమ సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వాగులపై నూతన వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపుతాం..