ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nellore court Theft Case: కోర్టులో చోరీ కేసు.. దర్యాప్తుపై సందేహాలెన్నో! - నెల్లూరు కోర్టు చోరీలో అనుమానాలెన్నో

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ప్రాపర్టీ నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురైందన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై...... సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ కేసు ప్రాపర్టీ తమ కోర్టు ఆధీనంలోనే లేదని, అది నెల్లూరు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ ఆధీనంలో ఉందని నెల్లూరు పీడీజే హైకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేయడంతో.. పోలీసు దర్యాప్తులోని లోపాలు చర్చనీయాంశమయ్యాయి. కోర్టులో చోరీ విషయం వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నీ చూస్తే..సమాధానం లేని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే పూర్తి నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Theft
Theft

By

Published : Apr 28, 2022, 4:41 AM IST

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురయ్యాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అవి కోర్టు ఆధీనంలో లేవని, నెల్లూరు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ ఆధీనంలో ఉన్నాయంటూ నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) డాక్టర్‌ సి.యామిని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేయడంతో.. పోలీసుదర్యాప్తులోని లోపాలు చర్చనీయాంశమయ్యాయి. కోర్టులో చోరీ విషయం ఈ నెల 14న బయట పడినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నీ విశ్లేషిస్తే సమాధానం లేని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తేనే పూర్తినిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది. దర్యాప్తులో నిగ్గు తేలాల్సిన అంశాలు ఇవీ...

గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు?

కేసులో ఆధారాలు కోర్టు నుంచి చోరీకి గురైనట్లు బెంచ్‌ క్లర్క్‌ నాగేశ్వరరావు కట్టుకథ సృష్టించారని నెల్లూరు పీడీజే తన నివేదికలో పేర్కొన్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో ఆయన కుమ్మక్కై కోర్టును తప్పుదారి పట్టించారని ఆమె తెలిపారు. వారు ఎవరు?

ఆ వస్తువులు ఎవరివి.. ఎక్కడివి?

కోర్టు సమీపంలోని మురుగు కాలవలో లభ్యమైన వస్తువులు, పత్రాలు కోర్టుకు సంబంధించినవి కాకపోతే.. అవి ఎవరికి సంబంధించినవి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు?

ఆ రోజు ఎందుకు సరిగ్గా రక్షణ కల్పించలేదు?

నెల్లూరు కోర్టు ప్రాంగణానికి 24 గంటల పాటు 3 ప్లస్‌ 1 పోలీసులతో భద్రత ఉంటుంది. చోరీ ఘటన జరిగిన ఈ నెల 13న మాత్రం సరిగ్గా రక్షణ కల్పించలేదని నెల్లూరు పీడీజే హైకోర్టుకు నివేదించారు. సరిగ్గా ఆ రోజే పోలీసులు ఎందుకు తగిన రక్షణ ఇవ్వలేదు? ఆ సమయంలో సిబ్బంది ఎక్కడ ఉన్నారు? వారు చోరీ విషయాన్ని ఎందుకు గమనించలేదు?

సెలవు రోజు వెళ్లాల్సినంత పని ఉందా?

*ఈ నెల 14న అంబేద్కర్‌ జయంతి. ఆ రోజు పబ్లిక్‌ హాలిడే. అయినా సరే తాను కొన్ని పెండింగ్‌ పనులు చేసుకోవడానికి కోర్టుకు వెళ్లానని నాగేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు? సెలవు రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదానిపై లోతుగా విచారించారా?

*ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీల్లో నాగేశ్వరరావు సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డులను పరిశీలించారా?

*కాకాణి నిందితుడిగా ఉన్న కేసు ప్రాపర్టీ మొత్తం తాను సొంతంగా వినియోగించే బీరువాలో ఓ బ్యాగులో పెట్టానని పోలీసులకు నాగేశ్వరరావు చెప్పారు. అత్యంత కీలకమైన కేసు ప్రాపర్టీని ఆయన వ్యక్తిగతంగా వినియోగించే బీరువాలో ఎలా పెట్టుకుంటారు? చోరీ జరిగిన రోజున ఆ బీరువాకు ఆయన ఎందుకు తాళం వేయలేదు?

మరికొన్ని సందేహాలు..

*చోరీ ఘటనకు సంబంధించి దర్యాప్తులో వేలిముద్రలు, పాదముద్రల్ని పూర్తిస్థాయిలో విశ్లేషించారా?

*డాగ్‌ స్క్వాడ్‌ను ఘటనా స్థలానికి తీసుకొచ్చారా?

*పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు నిజంగా ఆ చోరీ ఘటనతో సంబంధం ఉందా?

పోలీసులు పరిశీలించారా?

*మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాలే చోరీకి గురైనట్లు బెంచ్‌ క్లర్క్‌ బి.నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని ఆధారంగా వారు కేసు నమోదుచేశారు. చోరీలో పోయిందని చెబుతున్న ప్రాపర్టీ నిజంగానే కోర్టు ఆధీనంలోనే ఉందా? కోర్టు రికార్డుల్లో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎప్పడెప్పుడు ఏయే వివరాలు నమోదయ్యాయనే వివరాల్ని దర్యాప్తులో పోలీసులు పరిశీలించారా?

*బెంచ్‌ క్లర్క్‌ నాగేశ్వరరావు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని నెల్లూరు పీడీజే హైకోర్టుకు నివేదించారు. మరి ఆ కోణంలో పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయలేదు?

*చోరీలో పోయిందని చెబుతున్న ప్రాపర్టీ పోలీసుస్టేషన్‌ ఆధీనంలో ఉందని నెల్లూరు పీడీజే హైకోర్టుకు నివేదించారు. ఆ విషయం అంతకుముందు పోలీసులకు తెలియదా?

*కోర్టులో జరిగిన చోరీ కేసులో ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, నాలుగు సెల్‌ఫోన్లు, ఏడు సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఈ నెల 17న నెల్లూరు ఎస్పీ విజయరావు తెలిపారు. ఆ నాలుగు సెల్‌ఫోన్లలో రెండు పనిచేయట్లేదని, ఒకదాంట్లో సర్వీసు మెసేజ్‌లే ఉన్నాయని, మరొక ఫోన్‌ లాక్‌ అయిపోయిందని, స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో కాకాణి కేసు సమాచారం ఏమీ లేదని నెల్లూరు పీడీజే తన నివేదికలో పొందుపరిచారు. ఆ వస్తువులన్నీ మూడున్నర రోజుల పాటు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయని వివరించారు. స్వాధీనం చేసుకున్న పరికరాల్లోని డేటా ఏమైంది?

ఇదీ చదవండి:నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. మంత్రి కాకాణి, డీజీపికి నోటీసులు

ABOUT THE AUTHOR

...view details