గత ఏడాది నవంబర్లో జరిగిన ముక్తియార్ అనే వ్యక్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని హత్య చేసి గోనె సంచీలో చుట్టి పెన్నా బ్రిడ్జిపై నుంచి నదిలో పడేయగా.. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డబ్బుల కోసం వేధించడంతోనే..
నాలుగు నెలలపాటు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముక్తియార్ను కుటుంబ సభ్యులే అంతమొందించినట్లు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి మస్తాన్, సలీం, ఫయాజ్, ఖాదర్ భాషలను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. గూడూరుకు చెందిన ముక్తియార్ దొంగతనాలు చేస్తూ జల్సాగా జీవించేవాడు. నెల్లూరులోని తన చెల్లిలి ఇంటికి వచ్చిన ముక్తియార్, వారిని డబ్బు కోసం వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. ముక్తియార్ వేధింపులు తట్టుకోలేక కుటుంబ సభ్యులే హత్య చేసి, గోనె సంచీలో చుట్టి పెన్నానదిలో పడేశారు. కేసును అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు. మిస్టరీగా మారిన హత్య కేసు ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
ఇదీ చదవండి:నెల్లూరు డీఆర్ఓకి తప్పిన ప్రమాదం.. రెండు గేదెలు మృతి