భయం భయంగా నడుస్తూ ఆ పసి బిడ్డలు ఒడ్డుకు చేరుతారు. ప్రాథమిక విద్యకోసం ఆ చిన్నారులు పడే ఇబ్బందులు చూస్తే గుండె తరుక్కుపోక తప్పదు. భవిష్యత్తు కోసం ఉదయాన్నే ఆదరాబాదరా ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరి వస్తారు. సంవత్సరం, అర సంవత్సరం నుంచి కాదు.. రెండున్నర దశాబ్దాలుగా అవే కష్టాలు. ఇలా ఒక్కరిద్దరూ కాదు ఎంతో మంది ఈ తరహా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇందంతా ఎక్కడో కాదు దేశ అంతరిక్ష సత్తాచాటుతున్న శ్రీహరికోట చెంతనే ఉన్న.. ఇరకందీవిలోని విద్యార్థుల కష్టాలు.
భవిష్యత్ కోసం ఆ బోటు ప్రయాణం ప్రాథమిక పాఠశాలలు మూసివేత!
నెల్లూరు జిల్లా తడ మండల పరిధిలోని ఇరకం దీవి పంచాయతీ పరిధిలో 2 ప్రాథమిక పాఠశాలల ఉన్నాయి. ఇక్కడ ఉపాధ్యాయులు పని చేసేందుకు విముఖత చూపటంతో కొన్నేళ్లుగా మూతపడ్డాయి. విద్యావాలంటీరుతో అరకొర తరగతులు కొనసాగించిన ఫలితం లేకుండా పోయింది. దానికి తోడు ఇక్కడ ఉన్న మత్స్యకారులు తమిళ మాధ్యమంలో తరగతులు నిర్వహించేలా చూడాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. విధిలేని పరిస్థితుల్లో మత్స్యకారులు తమ పిల్లలను తమిళనాడులోని సున్నాంబుకుళంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, జూనియర్ కళాశాల విద్యార్థులు కలుపుకొని 150 మంది బోటులో చదువుకునేందుకు వెళ్తున్నారు.
పంపే వేళ కన్నీళ్లు...తిరిగొచ్చే వేళ ఆనందబాష్పాలు
బోటులో ప్రయాణిస్తున్న వేళ బలమైన గాలులు వీస్తుంటాయి. 20 మంది ఎక్కాల్సిన బోటులో 150 మంది ఎక్కుతారు. కారణం ఒక్కటే బోటు ఉండటం. అందులోనూ గంట ప్రయాణంలో పాఠశాల సమయానికి విద్యార్థులను రెండోసారి వెళ్లి తీసుకురావటం సాధ్యం కాదు. దీంతో ఎంత మంది వచ్చినా బోటు పుష్పక విమానంలా మారుతుంది. ఒకరిమీదు ఒకరు ఎక్కి కూర్చుంటారు. పిల్లలు బడికెళ్లే వేళ.. బిడ్డలను సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని బరువెక్కిన హృదయంతో చెబుతారు. సాయంత్రం కల్లా పిల్లలు ఇళ్లకు చేరగానే వాళ్లను చూసి ఆనందపడటం నిత్యకృత్యమైంది. తమ ప్రయాణంపై పిల్లలను కదిలిస్తే... భయపడుతూ ప్రయాణం చేస్తున్నాం..చదువు అవసరం కదా..ఏదైనా జరిగినా మాకు ఈత వచ్చని సమాధానం చెబుతున్నారు ఆ విద్యార్థులు.
లైఫ్ జాకెట్లు అందించిన తమిళ ప్రభుత్వం
నాలుగు రోజుల కిందట పాపికొండల వద్ద జరిగిన బోటు ప్రమాదంలో జాగ్రత్తలు తీసుకోనందునే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. పులికాట్ సరస్సులో ప్రతి రోజు విద్యార్థులు ప్రయాణిస్తున్న బోటులోనూ కనీస జాగ్రత్తలు పాటించటం లేదు. బంగాళాఖాతంతో కలిసి ఉన్న పులికాట్ సరస్సులో ప్రమాదం జరిగితే ఉప్పునీటిలో ఈదటం చాలా కష్టం. బురదతో కురుకుపోయే ఉండే పులికాట్ లో సహాయక చర్యలు చేపట్టాలన్న ఇబ్బందే. బోటు ప్రయాణం చేస్తున్న పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన లైఫ్ జాకెట్లు చిరిగిపోయి ఉన్నాయి. ఒక వేళ ఏదైనా ప్రమాదం జరిగినా రక్షించేందుకు బోటు లోపల ఎటువంటి పరికరాల, కిట్లు లేవు. ఇన్ని సమస్యల మధ్య వారి ప్రయాణం సాగుతూనే ఉంది.
ఒడ్డు వరకు చేరదు..బురదలో కాలు మోపాల్సిందే..
పులికాట్ లో నీరు తగ్గిపోవటం కారణంగా బోటు ఒడ్డు వరకు రావటం లేదు. విద్యార్థులు కిలోమీటరు లోపల దిగాల్సి వస్తుంది. కూరుకుపోయే బురదలో వీపుపై బండెడు పుస్తకాలు పెట్టుకుని, మరో చేతిలో చెప్పులు, భయం, భయంగా నడుస్తూ ఒడ్డుకు చేరుతున్న పసిబిడ్డల అవస్థలు చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. చదువు కోసం తమ ప్రాంతానికి వస్తున్నారనే సమాచారంపై తమిళనాడు ప్రభుత్వం కొంతవరకు స్పందించింది. తిరువళ్లూరు కలెక్టర్ పడవలో ప్రయాణించి కొందరు విద్యార్ధులకు లైఫ్ జాకెట్లు ఇప్పించారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించకపోవడం వల్లే పరిష్కారం కాలేదనే వాదన ఉంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందిస్తే దీర్ఘ కాలంగా ఉన్న వారి సమస్య పరిష్కరించవచ్చు. ఇరకం దీవి విద్యార్ధుల కోసం తమిళ మాధ్యమంలో బోధించే ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవచ్చు.