వాయుగుండం దెబ్బకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోని వస్తువులు, సామగ్రి, నగదు, నగలు, పత్రాలన్నీ వరదనీటిలో కలిసిపోయాయి. పంట పొలాలు మునిగాయి. గ్రామాల్లో అంధకారం అలుముకుంది. రహదారులు మరింత ఛిద్రమయ్యాయి. అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు. వాయుగుండం వల్ల మొత్తంగా వర్షాల(rains) వల్ల వివిధ సంఘటనల్లో 28 మంది మృత్యువాత పడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. అలాగే నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్దకు 2 మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కడప జిల్లా మాండవ్య నది దాటుతుండగా...అక్కాతమ్ముళ్లు నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిద్దరి మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
చిత్తూరు జిల్లాలో గ్రామాలు కొన్ని ఇంకా ముంపులోనే ఉన్నాయి. తిరుపతి నగరంలోని పలు కాలనీల్లో 3 రోజులుగా మోకాలి లోతు నీరు నిలిచే ఉంది. కడప జిల్లా రాజంపేట, నందలూరు ప్రాంతంలో రెండు గంటల్లోనే ఇళ్లు నేలమట్టమయ్యాయి. నెల్లూరు జిల్లాలో 29 గ్రామాలపై వరద ప్రభావం కనిపించింది. బుచ్చిరెడ్డిపాళెం దామరమడుగు వద్ద వరద సహాయక చర్యల్లో పాల్గొన్న శ్రీకాకుళానికి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు చనిపోయారు. భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,316 గ్రామాలు భయం గుప్పిట్లోకి చేరాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 6.33 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాడి పశువులు, కాడెద్దులు, దూడలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాయి. పంట పొలాల్లో ఇసుకమేటలు, రాళ్లు రప్పలు చేరాయి.
దెబ్బతిన్న నీటివనరులు
గ్రామీణ నీటిసరఫరాశాఖ పరిధిలో 595 చోట్ల నష్టం వాటిల్లింది. 4 జిల్లాల్లో 666 చిన్ననీటి వనరులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు రూపొందించింది. మొత్తం 17 జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు సహాయ చర్యలు చేపట్టాయి. రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ నెల 18న భారీవర్షాల ప్రభావం అధికంగా ఉంది. రాయలసీమతోపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో సగటున 4.9 సెం.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 10.7, కడప 9.7, అనంతపురం 7.7, నెల్లూరు జిల్లాలో 5.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
రైతుకు కన్నీళ్లు
4 జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రాథమిక అంచనాల ప్రకారమే వ్యవసాయ పంటలు 5.83 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. వరి, సెనగ, పత్తి పంటలు నీట మునిగాయి. పండ్ల తోటలు, కూరగాయల రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అరటితోపాటు బత్తాయి, దానిమ్మ తదితర రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. 2,403 చిన్న, పెద్ద పశువులు మృత్యువాతపడగా, 3,232 కోళ్లు చనిపోయాయి. పొలాల్లో నీరు తగ్గిన వెంటనే అధికారులు నష్టాన్ని అంచనా వేస్తారు. -కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి