అన్నదాతకు చేయూత ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. గ్రామస్థాయిలోనే అన్నిరకాల సేవలు అందించాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)లకు శ్రీకారం చుట్టగా.. ఆ దిశగా సత్ఫలితాలు రావడం లేదు.. రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందజేయాల్సి ఉన్నా.. వ్యవసాయాధికారుల కారణంగా క్షేత్రస్థాయిలో సాధ్యం కావడం లేదు. ఫలితంగా అన్నదాతలపై అదనపు భారం పడుతోంది.
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రబీ పంటలకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఖరీఫ్‌లో 1.13 లక్షల హెక్టార్లలో వరి, వేరుసెనగ, సజ్జ, కూరగాయలు, పండ్ల తోటలు తదితర పంటలు సాగయ్యాయి. రబీలో సుమారు 98 వేల హెక్టార్లల్లో పంటలు విస్తరించనున్నాయి. ఏటాలాగే.. ఈ ఏడాది కూడా రైతులు ప్రైవేటు ఎరువుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు అధిక ధరలకు ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా రైతులపై ఆర్థిక భారం పడుతోంది.
అదనంగా రూ.30 నుంచి రూ.50 వసూలు
జిల్లాలో 940 ఆర్‌బీకేలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు తక్కువ ధరకు ఎరువులు అందించాల్సి ఉండగా ఆ దిశగా వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టలేదు. అన్నదాతలకు అవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడం, సరఫరాలో తీవ్ర జాప్యం, గ్రామ వ్యవసాయ సహాయకుల అవగాహన రాహిత్యం తదితర కారణాలతో ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పటికే జిల్లాలో వరినాట్లు, ఇతర పంటల సాగు మొదలుకావడంతో అన్నదాతలు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు ఒక్కో యూరియా బస్తాపై సుమారు రూ.30 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు.
భారీగా వ్యత్యాసం