నెల్లూరు కేంద్ర గ్రంథాలయంతో పాటు కుల్లూరు, కోవూరు, నవాబుపేట, ఉదయగిరి, జలదంకిలో శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మించేందుకు రెండేళ్ల క్రితమే అనుమతులు మంజూరయ్యాయి. 2019 ఫిబ్రవరిలో నెల్లూరులోని కేంద్ర గ్రంథాలయానికి రూ.3 కోట్లతో పునర్‌నిర్మించేందుకు అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. అందుకు అవసరమైన రూ.50 లక్షల నిధులు, విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యుఐడీసీ)కి మంజూరు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారిపోయింది.
పాత భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను మార్చి గ్రంథాలయం వెనుక వైపునున్న స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని గ్రంథాలయ సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలా ప్రారంభమైన పనులు సైతం పునాదుల దశ దాటలేదు. మరోవైపు కలువాయి మండలంలోని కుల్లూరులో రూ.15 లక్షలతో నిర్మాణం పూర్తయిన భవనం ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు. కోవూరులో రూ.15.50 లక్షలు, ఉదయగిరిలో 26.30 లక్షలు, జలదంకిలో రూ.28.50 లక్షలతో ప్రతిపాదించిన భవనాల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నవాబుపేటలో రూ.25 లక్షలతో తలపెట్టిన భవన నిర్మాణానికి మూడుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాకపోవడంతో నిలిచిపోయింది.
అనివార్య కారణాలతో..
గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన భవనాల నిర్మాణాలను ఏపీఈడబ్యుఐడీసీకి అప్పగించాం. వారి ఆధ్వర్యంలో నెల్లూరు కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణం జరుగుతోంది. కోవూరు గ్రంథాలయ భవనానికి రూ.35 లక్షలకు వేసిన రీఎస్టిమేషన్లకు అనుమతులు రావాల్సి ఉంది. ఉదయగిరి, జలదంకి గ్రంథాలయ భవనాలకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. కుల్లూరు గ్రంథాలయాన్ని నిర్మించి ఈ మధ్యనే అప్పగించారు. కరోనా కారణంగా ప్రారంభం వాయిదా పడుతోంది. పరిస్థితులు చక్కబడ్డాక ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. -సి.హెచ్.ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి