ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ రోడ్డులో ప్రయాణం అత్యంత ప్రమాదకరం - నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక కథనం

నెల్లూరు జిల్లాలో కావలి నుంచి తడ వరకు దాదాపు 166 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. ఇది నిత్యం ప్రమాదాలతో రక్తసిక్తమవుతోంది. రహదారిపై ఎక్కడెకక్కడ లోపాలు ఉన్నాయి.. బ్లాక్‌ స్పాట్లు తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. ప్రమాదాలకు గల కారణాలేంటో తెలుసుకోవడం లేదు. వాహనాల మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నడిరోడ్లపై వాహనాలు నిలపడం తదితర నిర్లక్ష్యాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. యాక్సిడెంట్‌ జోన్లలో సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేయాల్సి ఉంది.

road accidents
ఆ రోడ్డులో ప్రయాణం అత్యంత ప్రమాదకరం

By

Published : Feb 18, 2021, 6:21 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో ఈనెల 11వ తేదీ జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు ఒకే మోటారు సైకిల్‌పై వెళుతున్నారు. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. అదే ప్రమాద సంఘటనను పరిశీలించడానికి వచ్చిన ఆర్టీసీ ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ కూడా అదే తరహాలో మృతి చెందారు. ఇక్కడి జాతీయ రహదారిపై నిత్యం ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నెల రోజుల కిందట పట్టణానికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్‌ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గూడూరు సమీపంలోని జాతీమ రహదారి పోటుపాలెం కూడలి వద్ద, ఆదిశంకర కళాశాల కూడలి వద్ద తరుచూ వాహనాలు ఢీకొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఆదిశంకర కళాశాల వద్ద ‘యు’ ఆకారంలో మలుపు ఉంది. ఇదే ప్రాంతంలో కూడలి కావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినా ప్రస్తుతం అవి లేవు.

ప్రాణం విలువ చెబుతున్నాం..

రోడ్డు భద్రత కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖల అధికారులు సహకారంతో బ్లాక్‌స్పాట్లలోనూ ప్రమాదాల నివారణకు దృష్టిసారిస్తాం. - మల్లికార్జునరావు, ట్రాఫిక్‌ డీఎస్ప

క్షణక్షణం.. భయం భయం

తడ మండలం తడకండ్రిగ పంచాయతీ బోడిలింగాలపాడు జాతీయ రహదారి కూడలి అత్యంత ప్రమాదకరంగా మారింది. అయిదేళ్లలో 10 మంది మృత్యువాత పడగా, 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కూడలిలో సర్వీసు రహదారులు ఏర్పాటు చేయకపోవడంతో భారీ వాహనాలు మలుపు తిరగడం ఇబ్బందిగా మారింది. పైవంతెన ఏర్పాటు చేస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్థానికులు అంటున్నారు.

కావలి మండలం గౌరవరం వద్ద రహదారి మలుపులో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పుతున్నాయి. ఆరులైన్ల రహదారి కాస్తా ఓ వైపున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ విషయమై కావలి ఆర్డీవో శ్రీనివాసులుకు చాలా ఫిర్యాదులు అందాయి.

దగదర్తి:లయన్స్‌నగర్‌ కాలనీ వద్ద నూతన వంతెన నిర్మాణం, అల్లూరు రోడ్డు సమీపంలో రైల్వే వంతెనకు ఒక వైపే రాకపోకలకు అనుమతించడంతో వాహనచోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. డైవర్షన్‌ సరిగా లేకపోవడం, సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడం ఇక్కడ సమస్యగా మారింది.

వెంకటాచలం:కృష్ణపట్నం పోర్టు రోడ్డు కూడలి, వెంకటాచలంలోని సర్వేపల్లి రోడ్డు కూడలి, కసుమూరు రోడ్డు, గొలగమూడి రోడ్ల వద్ద ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. నిబంధనల మేరకు కూడళ్లు వచ్చే ముందు వేగ సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎక్కడా కనిపించడం లేదు.

బిట్రగుంట: కావలి, నెల్లూరు నుంచి బిలకూటక్షేత్రానికి వెళ్లే వాహనాలు, కడనూతల వద్ద ఆకాశ వంతెన నుంచి కావలికి వచ్చే వాహనాలు పరస్పరం ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కూడలిలో అండర్‌ పాస్‌తో పాటు వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలి.

మనుబోలు :బద్దెవోలు వద్ద జాతీయ రహదారికి గండ్లుపడి అధ్వానంగా తయారైంది. ఈ ప్రాంతంలో తాత్కాలికంగా వేసిన రోడ్డులో మలుపు వద్ద వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి.

సూళ్లూరుపేట :హోలీక్రాస్‌ కూడలితో పాటు కోటపోలూరు మలుపు వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో వేగాన్ని నియంత్రించే స్పీడు బ్రేకర్లు, బారికేడ్లు సైతం కరవయ్యాయి.

ఆ రెండు చోట్లా..

కోవూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై నిత్యం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కోవూరు సాయిబాబా ఆలయం సమీపంలో వంతెన మలుపులో వాహనాలు ఒక్కసారిగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. రామన్నపాళెం వద్ద ఫ్లైవోవర్‌ వంతెన నిర్మించలేదు. దాంతో ఇటు చెన్నై అటు విశాఖపట్నం వైపు నుంచి వేగంగా వచ్చే వాహనాలు జంక్షన్‌ వద్ద ఉన్న కల్వర్టును ఢీకొంటున్నాయి. నెల్లూరు వైపు నుంచి నార్తురాజుపాళెం, విడవలూరు, అల్లూరు మండలాలకు వెళ్లేందుకు ఉన్న మలుపు అత్యంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు రోడ్డు దాటే సమయంలో విశాఖపట్నం వైపు నుంచి వేగంగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రాజమహేంద్రవరానికి చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళుతుండగా ఇదే ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రాంతాల్లో ఫ్లైవోవర్‌ వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

సంవత్సరం రోడ్డు ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2017 1412 509 1688
2018 1378 536 1510
2019 1266 526 1471
2020 1141 503 1175

ఇదీ చదవండి:

శ్రీకాకుళం కొండవలసలో 8 బ్యాలెట్ బాక్సులు లభ్యం

ABOUT THE AUTHOR

...view details