నెల్లూరు నగరాన్ని సుందరంగా మార్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. నగరంలోని ప్రధాన రోడ్లులో పచ్చదనం.. పార్కులు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లదకరమైన వాతావరణం కల్పించనున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రత్యేక శ్రద్ద చూపించటంతో నిధులకు కొరత లేకుండా పనులు వేగంగా జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
తొమ్మిది లక్షల జనాభా కలిగిన నెల్లూరును.. పచ్చదనంతో నింపేందుకు యోచిస్తున్నారు. ఈ నగరాన్ని స్వచ్ఛనగరంగా మార్చేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. నిత్యం నగరంలో ఎదురౌతున్న పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఆసుపత్రులు ఎక్కువగా ఉండే పొగతోటను సుందరంగా మార్చనున్నారు. బృందావనం, నర్తకీ సెంటర్, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేశారు. ఈ పనులను ఏ సమయంలోపు పూర్తి చేయాలన్న దానిపై అధికారులతో మంత్రి చర్చించారు. అలాగే మురుగు పారుదల వ్యవస్థను మెరుగుపరచి.. పూర్తి స్థాయిలో కాలువల నిర్మాణం చేపట్టనున్నారు.