ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సింహపురి గ'ఘన' స్వప్నం సాకారమయ్యేనా?

ఆశలకు రెక్కలు వస్తున్నాయి. ఆశయ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఏళ్లుగా మాటల వరకే పరిమితమైన దగదర్తి విమానాశ్రయ నిర్మాణం పట్టాలెక్కించే దిశగా కసరత్తు జరుగుతోంది. మాటలు దాటి చేతల్లో చూపితే తమ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్న వాదన సింహపురి వాసుల నుంచి వ్యక్తమవుతోంది.

dagadarthi-airport
dagadarthi-airport

By

Published : Nov 4, 2020, 7:26 PM IST

దగదర్తి దశ తిరిగేనా?

నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయం నిర్మాణం చేయాలని 2006లో నిర్ణయించారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని భావించారు. వివిధ కారణాలతో చివరి దశలో అది ఆగింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విమానాశ్రయంపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అందుకనుగుణంగా రూ.358 కోట్లతో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 11 నెలల్లోనే గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక వేశారు. ఆ దిశగా టర్బో ఏవియేషన్‌ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే భూసేకరణలో అడ్డంకులు, కోర్టు కేసులు, పలు వివాదాలు ఈ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారాయి. ఇప్పటికి అవి ఎడతెగని ప్రతిబంధకంగానే కొనసాగుతుండగా... మూడు నెలల కిందట విమానాశ్రయ నిర్మాణ పనులను దక్కించుకున్న టర్బో ఏవియేషన్‌ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఒప్పందం రద్దు చేశారు. పలుమార్లు గడువు పొడిగించినా పనులు మొదలు కాకపోవటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది.

గత ప్రభుత్వ హయాంలో 2500 ఎకరాలు భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. దామవరం, కౌరు గుంట, దగదర్తి, వెలుపోడు గ్రామాల్లో భూములు సేకరించేందుకు సర్వే చేశారు. అందులో పట్టా భూములు, సీజేఎఫ్ఎస్, అటవీ భూములు, కొండ ప్రాంత భూములు ఉన్నాయి. విమానాశ్రయ అధికారులు పలుమార్లు భూములు పరిశీలించి సంతృప్తి చెందినా.... భూసేకరణ, నిర్మాణ పనుల్లో ముందడుగు వేయలేదు. గత ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చినా కోర్టు కేసులు, భూవివాదాలతో భూసేకరణ పూర్తి కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తాజా అడుగులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వమే కర్నూలు విమానాశ్రయం తరహాలో సొంతంగా నిర్మించాలని భావిస్తోంది. ఇప్పుడైనా పరిహారం పక్కాగా చెల్లించి భూములు సేకరించాలని విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేస్తే జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని స్థానికులు కోరుతున్నారు.

విమానాశ్రయం నిర్మాణానికి అవసరమయ్యే భూముల సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తామని దగదర్తి తహసీల్దార్‌ వరకుమార్‌ అన్నారు. న్యాయస్థానంలో ఉన్న భూములకు సంబంధించి తీర్పు వెలువడిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఇదీ చదవండి

కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి ఎంపీ గల్లా జయదేవ్ లేఖ

ABOUT THE AUTHOR

...view details