ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో కర్ఫ్యూ పరిస్థితులు

నిత్యం రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఠాణాల్లోని పోలీసులు రోడ్లపైకి వచ్చారు. బారికేడ్లు.. పికెటింగ్‌.. ఇలా పగటి కర్ఫ్యూను బుధవారం జిల్లాలో కఠినంగా అమలు చేశారు. గత ఏడాది జరిగిన లాక్‌డౌన్‌ పరిస్థితుల్లే దర్శనమిచ్చాయి. అవసరమైతే తప్ఫ. అనవసరంగా ఎవరూ రోడ్లపై తిరగకుండా చూశారు. దుకాణదారులు, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయగా... ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్లన్నీ బోసిపోయాయి.

curfew
కర్ఫ్యూ

By

Published : May 6, 2021, 12:36 PM IST

పరిసర గ్రామాలు, మండలాల నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా శెట్టిగుంట రోడ్డు, ఆత్మకూరు బస్టాండ్‌, ప్రశాంతి నగర్‌, హరినాథనగర్‌, హరినాథపురం సర్కిల్‌, రామలింగాపురం, వీఆర్సీ సెంటర్‌, మద్రాసు బస్టాండ్‌, ఆర్టీసీ, గాంధీబొమ్మ, రైల్వేస్టేషన్‌, డైకాస్‌ రోడ్డు, అయ్యప్పగుడి, ఫులె విగ్రహం, ఇరుకళల పరమేశ్వరి ఆలయం తదితర అన్ని ప్రాంతాల్లో బారికేడుల పెట్టారు. వాటిని దాటుకుని రావాలంటే పోలీసు అనుమతి తప్పనిసరిగా మారింది. నగర డీఎస్పీ జె.శ్రీనివాసులు రెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ పి.మల్లికార్జునరావులు నగరంలో పరిస్థితిని సమీక్షించారు. కరోనా కేసులు పెరుగుతున్నా.. నిత్యం రద్దీగానే ఉండే నగరం బోసిపోయి కనిపించింది. షాపింగ్‌ మాల్స్‌కు తాళాలు పడగా.. వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లు ఖాళీగా కనిపించాయి.

12 గంటల తర్వాత నెల్లూరు గాంధీ కూడలి

అంతకు ముందు

ప్రజలు సహకరించండి..

కర్ఫ్యూ తొలిరోజు ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ నగరంలో పర్యటించారు. మధ్యాహ్నం సుడిగాలి పర్యటన చేశారు. కేవీఆర్‌ పెట్రోల్‌ బంకు, ఆర్టీసీ, వీఆర్సీ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలును పరిశీలించారు. స్థానిక పోలీసులతో మాట్లాడి.. సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల విలువైన ప్రాణాల కోసం పోలీసులు రోడ్లపై ఉన్నారని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్దనే ఉండాలని కోరారు. పోలీసు శాఖ తీసుకునే చర్యలకు సహకరించాలని ప్రజలను కోరారు. ఆయనతో పాటు కలెక్టర్‌ కూడా ఉన్నారు.

సరిహద్దులో

రామాపురం(తడ): ఆంధ్ర- తమిళనాడు రాష్ట్ర సరిహద్ధు. తడ మండలం పన్నంగాడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటైంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వ సూచనల మేరకు సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వరరెడ్డి, తడ ఎస్సై జేపీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందితో వంతుల వారీగా చెక్‌పోస్టులో విధులు కేటాయించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేశారు. సరకు రవాణా వాహనాల్లో ప్రయాణికులు తరలకుండా పర్యవేక్షించారు. వైద్య సేవలు, ఇతర అత్యవసరాల కోసం మాత్రమే వాహనాల్లో ప్రయాణించాలి తప్ఫ. అనవసరంగా తిరగొద్దని సూచించారు. ప్రయాణానికి గల కారణాలను ప్రశ్నించి.. ప్రయాణికుల వివరాలు సేకరించారు.

రాష్ట్ర సరిహద్దులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

ఇదీ చదవండీ…'నాకు ఊపిరి అందట్లేదు... నా భార్య జాగ్రత్త !'

ABOUT THE AUTHOR

...view details