నెల్లూరు జిల్లా ఎస్.పేట మండలం చౌట భీమవరం గ్రామంలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపట్లేదని ఓ అల్లుడు అత్తను కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూబగుంట గ్రామానికి చెందిన తిరుపతి.. చౌటభీమవరానికి చెందిన దొరసానమ్మను 25 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ మద్యం సేవించి ఆమెను వేధిస్తుండేవాడు.
దొరసానమ్మ తన తల్లి పోలమ్మ ఇంటికి వెళ్లి ఉంటోంది. ఇన్నిరోజులైనా భార్యను తన వద్దకు పంపలేదని తిరుపతి.. అత్త పోలమ్మపై కక్ష పెంచుకున్నాడు. మద్యం సేవించి కాపుకాసి.. కత్తితో ఆమెను పొడిచి పారిపోయాడు. మెడపై తీవ్ర గాయాలైన పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హంతకుడి కోసం గాలింపు చేపట్టారు.