ఆస్తి తన పేరు మీద రాయాలంటూ తల్లిపై తనయుడు దాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి గ్రామంలో జరిగింది. ఆరు పదుల వయసు దాటిన ఈశ్వరమ్మ కొడుకుతో దెబ్బలు తిని ఆసుపత్రి పాలైంది. బాధితురాలు, ఆమె మరో కుమారుడు సుబ్బారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈశ్వరమ్మ భర్త ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయారు. ఆ తర్వాత కారుణ్య నియామకంలో భాగంగా పెద్ద కుమారుడు దశరథరామిరెడ్డికి ఆర్టీసీలో మెకానిక్ ఉద్యోగం లభించింది. రెండో కుమారుడు సుబ్బారెడ్డి నెల్లూరులో వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు.
ఈశ్వరమ్మ పేరు మీద ఉన్న పొలం తన పేరు మీద రాయాలంటూ దశరథరామిరెడ్డి బుధవారం గొడవకు దిగాడు. అతని భార్యతో కలిసి ఈశ్వరమ్మను గాయపరిచారు. బాధితురాలు ఆత్మకూరులోని జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతోంది. తల్లిపై దాడికి పాల్పడిన కుమారుడు దశరథరామిరెడ్డిపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.