Mekapati Chandrasekhar Reddy : నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వారసత్వ ఆరోపణల్లో చిక్కుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డే తన తండ్రంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ ప్రకటనతోపాటు వీడియో విడుదల చేశారు. దీనికి సాక్ష్యంగా.. చంద్రశేఖర్‌రెడ్డితో ఉన్న చిన్ననాటి ఫోటోలు బయటపెట్టారు. చంద్రశేఖర్‌రెడ్డి 18 ఏళ్లుగా తనను దూరంపెట్టారని శివ చరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కుమారులెవరూ లేరని చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడం బాధ కలిగించిందని.. అందుకే ఇప్పుడు బయటకు వచ్చానని శివచరణ్ రెడ్డి తెలిపారు. కుమారుడు ఉన్నారని చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి వదిలేశారని ఆ యువకుడు తెలిపారు. మా నాన్నను ఇబ్బంది పెట్టకూడదని తన తల్లి చెప్పటం వల్లే.. ముందుకు రాలేదన్నారు.
"మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మా నాన్న. ఇటీవల ఆయన ఓ ఛానల్ ఇంటర్వూ ఇస్తుండగా నాకు కొడుకులు లేరని అన్నారు. నేను బతికి ఉండగానే కొడుకు లేరని అనటం జీర్ణించుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు ముందుకు వచ్చాను. ఏ ప్రజల ముందైతే నాకు కొడుకు లేరని అన్నారో.. అదే ప్రజల ముందు కొడుకు ఉన్నారని చెప్పాలని కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు నాకు మా నాన్న ప్రేమ దక్కలేదు. చిన్నప్పుడు హస్టల్లో చేర్పించారు. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మమ్మల్ని మానాన్న పూర్తిగా వదిలేశారు. నాకు స్కూల్ ఫీజులు కట్టేవారు. ఇన్ని సంవత్సరాలు నేను ముందుకు రాలేదు ఎందుకంటే.. నాన్నను ఇబ్బంది పెట్టకూడదని మా ఆమ్మ చేప్పేవారు. నేనేమి ఆస్తులు, రాజకీయ వారసత్వం కావాలని కోరుకోవటం లేదు." -శివచరణ్ రెడ్డి