ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సింహ'పురిపై వైకాపా విజయ 'గర్జన'

కడప, కర్నూలు, విజయనగరంలో అన్ని స్థానాలను సాధించిన వైకాపా.. నెల్లూరులోనూ తన విజయపరంపరను కొనసాగించింది. ప్రత్యర్థి అనే మాట లేకుండా జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలనూ తన ఖాతాలో వేసుకుంది.

నెల్లూరుని ఊడ్చేసిన వైకాపా

By

Published : May 24, 2019, 5:21 AM IST

Updated : May 24, 2019, 7:11 AM IST


నెల్లూరు జిల్లా రాజకీయాలను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది వైకాపా. గత ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు గాను 7 సాధించగా... ఈ సారి పూర్తి స్థానాల్లో జెండా పాతింది. మిగతా పార్టీలను దరిదాపుల్లోకి రానీయకుండా విజయఢంకా మోగించింది. రాష్ట్ర ప్రజలకు ఉత్కంఠ పంచిన నెల్లూరు సిటీ స్థానంలోనూ తెదేపా పాగా వేయలేకపోయింది. ఎమ్మెల్సీకోటాలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నారాయణకు ఈ ఎన్నికల్లో చేదు అనుభవమే ఎదురైంది. వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్​పై విజయం సాధించలేకపోయారు. ఇదే రీతిలో మంత్రి పదవి చేపట్టిన సోమిరెడ్డిని ఓటమి వదిలిపెట్టలేదు. వరుసగా అయిదో సారి ఎన్నికల్లో ఓడిపోయారు. కాకాని గోవర్థన్ రెడ్డి సర్వేపల్లి స్థానంలో విజయం సాధించారు. వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు తీరం చేరారు. తెదేపా అభ్యర్థి కె.రామకృష్ణపై పై ఆధిక్యం సాధించారు. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో తెదేపా నేత బొల్లినేని కృష్ణయ్యపై మేకపాటి గౌతం రెడ్డి విజయం సాధించారు. కోవూరు స్థానాన్ని వైకాపా సొంతం చేసుకుంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఈ స్థానంలో గెలుపొందారు. తెదేపా అభ్యర్థి పోలవరం శ్రీనివాసుల రెడ్డి ఓటమి చవిచూశారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధిక్యం సాధించారు. తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన బొల్లినేని రామారావుకు చేదు అనుభవమే మిగిలింది. సూళ్లూరుపేటలో పర్సా వెంకటరత్నంపై సంజీవయ్య విజయం సాధించారు. మరో ముఖ్య ప్రాంతమైన నెల్లూరు గ్రామీణ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దక్కించుకున్నారు. తెదేపా నేత అబ్దుల్ అజీబ్​కు నిరాశే మిగిలింది. గూడూరులో వరప్రసాద్ విజయం ఢంకా మోగించారు. పాశం సునీల్​కు ఓటమి తప్పలేదు. ఇక కావలి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇక నెల్లూరు లోక్​సభ నియోజవర్గంలోనూ తెదేపా అభ్యర్థి బీద మస్తాన్​ రావుపై ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.

Last Updated : May 24, 2019, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details